ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ కు కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2017లో ఒక మైనర్ బాలికను అత్యాచారం చేశాడని సెంగార్ పై కేసు నమోదు అయ్యింది. దానిపై చాలా రచ్చ జరిగింది. బాలికను, బాలిక కుటుంబాన్ని బీజేపీలో ఉన్నప్పుడు ఈయన బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి.
అలాగే ఆ బాలిక, వారి కుటుంబీకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ ప్రమాదంలో ఆ బాలిక కుటుంబీకులు ఇద్దరు మరణించారు. ఆ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను దోషిగా నిర్ధారించింది కోర్టు.
చాలా కాలం పాటు ఆయనను కాపాడుకుంటూ వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం చివరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. మొదట్లో బీజేపీ నేతలంతా ఆయనను అమాయకుడన్నారు. అయితే.. దోషిగా తేలే సమయానికి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఆయన దోషిగా తేలారు.తాజాగా శిక్ష కూడా ఖరారు అయ్యింది.
ఆయనకు జీవిత ఖైదును విధించింది న్యాయస్థానం. దాంతో పాటు ఆ బాలికకు పరిహారంగా పాతిక లక్షల రూపాయల డబ్బును ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. రాజకీయంగా సెంగార్ కు ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో ముందు ముందు కూడా ఆ బాలిక భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.