సినిమా రివ్యూ: ప్రతిరోజూ పండగే

సమీక్ష: ప్రతిరోజూ పండగే రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: జిఏ 2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌ తారాగణం: సాయి తేజ్‌, సత్యరాజ్‌, రావు రమేష్‌, రాశి ఖన్నా, విజయ్‌కుమార్‌, హరితేజ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సుహాస్‌, అజయ్‌,…

సమీక్ష: ప్రతిరోజూ పండగే
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: జిఏ 2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌
తారాగణం: సాయి తేజ్‌, సత్యరాజ్‌, రావు రమేష్‌, రాశి ఖన్నా, విజయ్‌కుమార్‌, హరితేజ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సుహాస్‌, అజయ్‌, రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: జైకుమార్‌
నిర్మాత: బన్నీ వాస్‌
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2019

బిజీ జీవితంలో పడిపోయి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే పిల్లల గురించిన కథలు పలుమార్లు సినిమాలయ్యాయి. ఇటీవలి కాలంలో కూడా ఇదే కాన్సెప్ట్‌తో 'శతమానం భవతి' లాంటి చిత్రాలొచ్చాయి. మారుతి అందరికీ తెలిసిన కథనే ఎంచుకున్నా కానీ నేటి కాలం వాస్తవిక పరిస్థితులని, పెరిగిన బాధ్యతలతో పిల్లల్లో వచ్చే యాంత్రిక ధోరణిపై దృష్టి పెట్టాడు. కొన్ని వారాలలో చనిపోయే తండ్రి కోసం తమ బిజీ జీవితాల నుంచి అన్ని రోజులు వెచ్చించడానికి షెడ్యూల్‌ వేసుకొచ్చే పిల్లల మనస్తత్వంపై సోషల్‌ సెటైర్‌ వేస్తూ ఈ సీరియస్‌ సబ్జెక్ట్‌కి తనదైన రీతిలో కామెడీతో షుగర్‌ కోటింగ్‌ అద్దాడు.

తండ్రి కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పిన డాక్టర్‌తో 'ప్రిసైస్‌గా ఎన్ని వారాల్లో… ఎక్స్‌టెండ్‌ అవ్వవచ్చా?' అని అడిగే 'ప్రాక్టికల్‌' కొడుకు తన కొడుకు దగ్గరకు వచ్చేసరికి వారం రోజులు కూడా చూడకుండా వుండలేనంటాడు. తండ్రి చనిపోతున్నాడని తెలిసి పోవడానికి రెండు వారాల ముందు వస్తానని చెప్పిన అదే కొడుకు తన కొడుక్కి పెళ్లి అనేసరికి ఉన్నపళంగా వచ్చేస్తాడు. మారుతి ఎంత కామెడీ కోటింగ్‌తో ఈ కథ చెబుతున్నా కానీ ఇలాంటివి కని, పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే వారికి ఛెళ్లున తగిలేట్టుంటాయి. 'మెటీరిలియలిస్టిక్‌ కొడుకులు, కూతుళ్లు, కోడళ్ల'ని మారుతి మొదట్లో గీత దాటకుండా ఎస్టాబ్లిష్‌ చేసాడు కానీ తర్వాత్తర్వాత వారి పాత్రలు 'రోత' పుట్టే రీతిన మార్చేసాడు. నిర్లక్ష్యం, పనుల ఒత్తిడి వేరు, మనిషి ప్రాణం పట్ల ఏమాత్రం జాలి, దయ చూపించకపోవడం వేరు. పైగా ఇక్కడ చనిపోతున్నది తండ్రి. వారు అతడిని నిర్లక్ష్యం చేసిందీ లేదు, లేదా వారు ఏదో గొగవలు పడి కమ్యూనికేషన్‌ గ్యాప్‌లో పడిపోయిందీ లేదు.

ఏ కామెడీ కోటింగ్‌ అయితే ఈ కథని నెరేట్‌ చేయడానికి మారుతి పరికరంగా వాడుకున్నాడో, అదే ద్వితియార్ధంలో వికటించింది. తండ్రి చనిపోతున్నాడని ఒక కొడుకు సమాధుల డిజైన్స్‌ చేసి చూపిస్తే, మరొకడు ఏకంగా శవయాత్ర తాలూకు బస్‌ అలంకరించుకుని తెస్తాడు. కావాలంటే ఒక రౌండ్‌ వేసి వద్దామంటాడు. కోడలేమో తులసి నీళ్లు టేస్ట్‌ చూసి ఎలా కావాలో చెప్తే అలాగే చేసిపెడతానంటుంది. దీన్నంతా కామెడీగా తీసుకోమన్నా కానీ కొడుకుల ప్రాక్టికల్‌ నేచర్‌ చూపించడంలో 'టూమచ్‌' చేసారనేది సుస్పష్టం. ప్రథమార్ధంలో కూడా మారుతి కొడుకుల ఆలోచనా ధోరణి చూపించాడు కానీ అది నవ్వించేలానే వుంది తప్ప ఫోర్స్‌డ్‌గా అనిపించలేదు. ఎమోషనల్‌గా సత్యరాజ్‌ పాత్ర తాలూకు పెయిన్‌ తెలియడం కోసమని మారుతి ఇలా కొడుకులని అంతటి విలన్లుగా చూపించినట్టున్నాడు. కానీ చావులో కూడా వారు బేసిక్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌ చూపించలేకపోయారంటే, నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరికీ తండ్రి పట్ల కాస్త ప్రేమ కూడా లేదంటే తండ్రిగా సత్యరాజ్‌ ఫెయిలైనట్టు చెబుతున్నానని మారుతి గ్రహించలేదు.

రావు రమేష్‌ పాత్రయినా మంచి, చెడుకి మధ్య ఊగిసలాడుతున్నట్టు కనిపిస్తుంటుంది కానీ మిగతా పిల్లల ధోరణి మరీ ఘోరం. ఒక పాయింట్‌కి వచ్చేసరికి రావు రమేష్‌ని కూడా అందరికంటే హేయంగా మార్చేసారు… ఎమోషన్‌ కోసం! ''ఎక్కడికెళ్లినా నిమిషం అటు, ఇటు కాకుండా వెళ్లిపోయే నువ్వు చావు విషయంలో మాత్రం ఎందుకు టైమింగ్‌ మిస్సయ్యావ్‌'' అంటూ తండ్రి త్వరగా చావలేదని మాట్లాడే కొడుకులు వుండవచ్చునేమో కానీ ఇందులో రావు రమేష్‌ పాత్ర అయితే అంతకి దిగజారకూడదు. ఎమోషన్స్‌ చిన్న చిన్న అపార్ధాలు, అపోహలతో కూడా రేకెత్తించవచ్చు. ఇలాంటివి మరీ ఈ సన్నివేశంలో ప్రేక్షకులకి చివుక్కుమనాలి అని చేసినట్టు అనిపిస్తాయి. ఈ తంతు అంతా క్లయిమాక్స్‌లో సదరు పిల్లలకి కనువిప్పు కోసం జరుగుతోందని, అంత వరకు ఇదంతా కామ్‌గా చూస్తూ ఏ ఒక్క సందర్భంలోను పెదవి విప్పని 'హీరో' స్పీచ్‌ కోసం గ్రౌండ్‌ ప్రిపేర్‌ అవుతుందని ఈజీగా ప్రిడిక్ట్‌ చేయవచ్చు.

ఈ ఫోర్స్‌డ్‌ ఎమోషన్స్‌తో డిస్‌కనక్ట్‌ చేసేసాడు కానీ లేదంటే ఫస్ట్‌ హాఫ్‌లో మారుతి ఫుల్‌ ఫామ్‌లో కనిపించాడు. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో తన పట్టు మరోసారి చూపించాడు. సత్యరాజ్‌ పాత్ర అంతర్మధనాన్ని చాలా బాగా తెర మీదకి తీసుకొచ్చాడు. రావు రమేష్‌ పాత్ర తాలూకు కెరియర్‌, ఫ్యూచర్‌, ఫాదర్‌ మధ్య నలిగే ఆ ఊగిసలాట ధోరణితో అద్భుతంగా క్యాప్చర్‌ చేసాడు. ఈ విషయంలో మారుతి కంటే రావు రమేష్‌కి ఎక్కువ మార్కులివ్వాలి. పాత్రని అంతగా ఆకళింపు చేసుకుని పరకాయ ప్రవేశం చేసిన తీరు, టైమింగ్‌తో చెప్పిన డైలాగులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. రావు రమేష్‌ని మైనస్‌ చేస్తే ఇందులో 'పండగే' వుండదనాలి. అలాగే టిక్‌టాక్‌ సెలబ్రిటీగా రాశి ఖన్నా పాత్రని మలిచిన విధానం, ఆమె వైఖరి కూడా మారుతి సునిశిత దృష్టికి, ట్రెండ్‌ని ఎంతగా ఫాలో అవుతాడనేదానికి అద్దం పడుతుంది. ద్వితియార్ధంలో ఎమోషన్‌ బలంగా పండాలి, తండ్రి తాలూకు బాధ గట్టిగా తెలియాలన్నట్టు ఫోర్స్‌డ్‌ సీన్లతో గాడి తప్పాడు కానీ అక్కడ కూడా మారుతి నేచురల్‌ ఎమోషన్స్‌ని చూపించినట్టయితే ఇది ప్రతిక్షణం పండగలా వుండేది.

సాయి తేజ్‌ నటుడిగా ఈ చిత్రంలో మరింత ఇంప్రెస్‌ చేస్తాడు. ఎక్కడా గొంతు లేపకుండా, తన ఫ్రస్ట్రేషన్‌ చూపించే చోట కూడా అదే సటిలిటీతో మెప్పిస్తాడు. సత్యరాజ్‌ కూడా బాధ, కోపం, ఆనందం అన్నీ మనసులోనే దాచుకుని, ఎలాంటి ఎమోషన్‌ని బయటకు ఎక్స్‌ప్రెస్‌ చేయని నైజమున్న పాత్రలో చక్కని అభినయంతో ఈ చిత్రానికి పిల్లర్‌గా నిలిచాడు. రాశిఖన్నా పాత్ర పరిచయ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి కానీ ఆ పాత్ర పొటెన్షియల్‌ని మారుతి పూర్తిగా 'ట్యాప్‌' చేయలేదు. సుహాస్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, హరితేజ, ప్రవీణ్‌ తమ సహజ నటనతో ప్రెజెన్స్‌ తెలిసేట్టు చేస్తారు.

తమన్‌ పాటలు వినడానికి, చూడ్డానికీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. పల్లె వాతావరణంలో ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. దర్శకుడిగా మారుతి పరిణతి చూపించాడనడంలో సందేహం లేదు కానీ కాస్త బ్యాలెన్స్‌ పాటించినట్టయితే ఇది తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌ మూవీ అయి వుండేది. బాధని నవ్వులతో ప్రెజెంట్‌ చేయగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటి హెవీ కాన్సెప్ట్‌లోను ఇంత హాయయిన హాస్యాన్ని జోడించడంలోనే మారుతి ప్రతిభ చూపించాడు. విసు, భాగ్యరాజ్‌లాంటి దర్శకులు సోషల్‌ సెటైర్స్‌ని ఇంత స్ట్రయికింగ్‌గా వేసేవారు.

ఫస్టాఫ్‌లోని నవ్వించే వినోదం కోసం, పతాక సన్నివేశాల్లో పలికించే భావోద్వేగాల కోసం, అన్నిటికీ మించి రావు రమేష్‌ అభినయం కోసం 'ప్రతిరోజూ పండగే' వీక్షించవచ్చు. ద్వితియార్థంలో మరీ నేల విడిచి సాము చేసిన విధానం, ఫోర్స్‌డ్‌ ఎమోషన్స్‌ కోసం పిల్లలని అత్యంత దారుణంగా చిత్రీకరించిన వైనం దీనిని 'తప్పక' చూడాల్సిన చిత్రం కానివ్వలేదు. 'అయ్యో పాపం' అనిపించాల్సిన చోట 'ఇది మరీ టూమచ్‌' అనేట్టుండడమే ఈ పండగని పూర్తిగా ఆస్వాదించనివ్వలేదు.

బాటమ్‌ లైన్‌: సగం పండగ!

గణేష్‌ రావూరి