మామూలుగా నిర్మాతల ఆఫీసుల మీద, హీరోల ఇళ్ల మీద ఐటీ రైడ్స్ జరిగే వార్తలను చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఒక హీరోయిన్ ఇంటి మీద జీఎస్టీ అధికారుల రైడ్స్ జరగడం ఆసక్తిదాయకంగా ఉంది. హైదరాబాద్ లోని నటి లావణ్య త్రిపాఠి ఇంటి మీద డీజీ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీలు ఎగవేశారనే ఆరోపణలతో లావణ్య ఇంటి మీద అధికారుల దాడులు సాగినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తన ఇంట్లో సోదాల విషయం తెలుసుకున్న లావణ్య వెంటనే షూటింగును రద్దు చేసుకుని అక్కడకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ హీరోయిన్ ఇంటితో పాటు హైదరాబాద్ లోని పలు వ్యాపార వర్గాల ఇళ్లపై కూడా అధికారుల రైడ్స్ కొనసాగినట్టుగా తెలుస్తోంది.
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం అంత ఫామ్ లో కూడా లేదు. వరస సినిమాల ఫెయిల్యూర్స్ తో ఆమెకు ఆఫర్లు బాగా తగ్గుముఖం పట్టాయి. విడుదల వాయిదా పడుతూ వచ్చిన అర్జున్ సురవరం ఇటీవలే విడుదల అయ్యింది. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ సినిమా హిట్ తో లావణ్య కెరీర్ పుంజుకోవాల్సి ఉంది. ఇలా కెరీర్ విషయంలో వెనుకబడిన ఒక హీరోయిన్ ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు రైడ్స నిర్వహించడం విశేషమే!