సమీక్ష: రూలర్
రేటింగ్: 1/5
బ్యానర్: హ్యాపీ మూవీస్, సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
తారాగణం: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, జయసుధ, భూమిక, ప్రకాష్‌రాజ్, సప్తగిరి తదితరులు
కథ: పరుచూరి మురళి
సంగీతం: చిరంతన్‌భట్
ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
నిర్మాత: సి. కళ్యాణ్
కథనం, దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019
కథ ఎక్సయిట్ చేస్తేనో, క్యారెక్టర్ బాగా నచ్చేస్తేనో, కామెడీ వర్కవుట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వస్తేనో జనరల్‌గా ఒక సినిమాని పట్టాలెక్కిస్తారు. కానీ కొన్ని సినిమాలు చూస్తే కేవలం ఇప్పుడో సినిమా చేయాలి అనే ఫీలింగ్‌తో ఏదో ఒక పాయింట్ అనేసుకుని సెట్స్ మీదకి వెళ్లిపోయుంటారు అనిపిస్తుంది. లేదంటే పరుచూరి మురళి చెప్పిన కథలో అంత 'వావ్' అనుకునే ఎలిమెంటే లేదు. గట్టిగా మాట్లాడితే 'విక్రమార్కుడు' కథలో ద్విపాత్రలని ఒక్కటి చేసి, సగటు బాలకృష్ణ మార్కు ఫార్ములా ట్రీట్‌మెంట్ జోడించి రాసేసారు. సీజన్డ్ యాక్టర్లయిన జయసుధ, ప్రకాష్‌రాజ్ లాంటి వారు కూడా అత్యంత క్లూలెస్‌గా, 'యాక్షన్' అనే మాట విని డైలాగులు చెబుతూ, 'కట్' కోసం వెయిట్ చేస్తున్నట్టనిపించారు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే… రూలర్ లాంటి సినిమాలు ఆయనకి కొత్త కాదు. పదే పదే ప్రేక్షకులు తిప్పికొట్టిన ఫార్ములా అయినా కానీ మరోసారి అదే వర్కవుట్ అవుతుందని ఎలా అనుకుంటారో అర్థం కాదు. గతం మరచిపోయి వేరే వ్యక్తిలా జీవిస్తోన్న హీరోకి తర్వాత అతని గతమేంటో తెలిసి కర్తవ్యం బోధ పడుతుంది. 'విజయేంద్రవర్మ' పాయింట్ ఇది కాదా? బాలకృష్ణ సినిమా అనగానే హీరోకి రెండు షేడ్స్ వుండాలి. అయితే అది ద్విపాత్రాభినయం, లేదా ఒకటే పాత్రని రెండు షేడ్స్‌లో చూపించడం! ఈ ముతక ఫార్ములా చూసి చూసీ ఫాన్స్‌కి కూడా విసుగొచ్చేసింది కానీ చేసి చేసీ బాలకృష్ణ మాత్రం ఇంకా అలసిపోలేదు. ఇప్పటికీ అదే ఎనర్జీతో ఇలాంటి పాత్రల్ని రక్తి కట్టించాలని శక్తి వంచన లేకుండా, కించిత్ అపనమ్మకం లేకుండా, సిన్సియర్‌గా, సీరియస్‌గా కృషి చేస్తున్నారు.
యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో వున్న వ్యక్తికి వైద్యం చేయించి, అతడు గతం మరచిపోతే, అతడిని కొడుకుగా స్వీకరించి, తమ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధినేతని చేస్తుందొకామె (జయసుధ). అరుణ్ ప్రసాద్‌కి (బాలకృష్ణ) గతం ఏమిటో గుర్తు లేకపోయినా, చదివింది ఏమిటో తెలియకపోయినా, రెండేళ్లలోనే కార్పొరేట్ కింగ్ అయిపోయి 'టోనీ స్టార్క్' మాదిరి లుక్‌తో తిరిగేస్తుంటాడు. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్‌లో సగం ప్రదేశం తెలుగోళ్లదే అన్నట్టు చాలా మంది తెలుగు రైతులు యుపి వాళ్ల దౌర్జన్యం కింద పడి నలిగిపోతుంటారు. అనుకోకుండా టోనీ స్టార్క్ అక్కడికి వెళితే అక్కడున్న రైతన్నలు అతడిని చూసి నువ్వే మా ధర్మ (బాలకృష్ణ) అంటారు. పోలీస్ అయిన ఆ ధర్మ విచిత్రమైన విగ్‌తో తెరపై కనిపించగానే 'బ్రింగ్ టోనీ స్టార్క్ బ్యాక్' అని చూసేవాళ్లు అనుకుంటారు.
బాలకృష్ణ కథల ఎంపికతో పాటు ఆయన స్టయిలిస్టుల విగ్ ఎంపిక కూడా వెరీ క్వశ్చనబుల్. ఆయన బయట కనిపించే లుక్ పర్‌ఫెక్ట్‌గా వున్నపుడు సినిమాకో రకంగా ఎందుకు చూపిస్తుంటారో అర్థం కాదు. పైగా పోలీస్ గెటప్ అనుకున్నపుడు ఈ జులపాలు, మధ్య పాపిడి ఎలా సెట్ అవుతాయని అనుకున్నారు? ఇక కాస్టింగ్ పరంగా బాలకృష్ణ తల్లిగా జయసుధని ఏ సన్నివేశంలోను యాక్సెప్ట్ చేయలేం. అమ్మ అని పిలుస్తున్న ఏ మూమెంట్‌లోను అడ్జస్ట్ అవలేం. సోనాల్ చౌహాన్ అయితే తన ముఖంలో హావభావాలు కనిపించవని రియలైజ్ అయిపోయి ప్రతి సినిమాలోను బికినీ ధరిస్తున్నట్టుంది. వేదికకి ఎప్పుడో జమానాకో సినిమాలో ఛాన్స్ వస్తోంటే వచ్చిన యాక్టింగ్ కూడా మరచిపోయినట్టుంది. భూమిక పాత్ర ఈ కథని ఎమోషనల్‌గా నిలబెట్టేదని బలంగా నమ్మేసారు కానీ నిజానికి ఈ కథని హల్క్ భుజాలపై వేసినా కానీ పది నిమిషాలకే కృంగిపోతాడు.
బాలకృష్ణ సినిమా అనగానే 'ఉడిపి మెస్ మెన్యూ'లా స్టాండర్డ్ ఐటెమ్స్ కొన్ని వుండాలని దర్శకులు ఫీలవుతారు. ఉదాహరణకి ట్రెయిన్‌పై ఫైట్ చేయించడం, ఆడవాళ్లని గౌరవించండి అంటూ లెక్చర్లు చెప్పించడం, రైతుల కష్టాల గురించి మరో చేంతాడంత డైలాగ్ పెట్టడం లాంటివి. ఇక డైలాగులలో నా కొడుకులు, ఇంకేవో బీప్‌లు మోస్ట్ కామన్ అనుకోండి. ఎంత బ్యాడ్ సినిమాకి అయినా ఒక స్ట్రక్చర్, స్క్రీన్‌ప్లే వుంటాయి. కానీ ఈ చిత్రంలో ఏదీ సవ్యంగా వుండకపోగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తాను అప్‌డేట్ అయ్యానని చూపించుకోవడానికి చేసిన చిన్న చిన్న ట్రిక్కులు.. ఉదాహరణకి, సోనాల్ చౌహాన్ చెయ్యి పట్టుకుంటే, వేదిక పాటతో నెక్స్‌ట్ సీన్ ఓపెన్ అవడం లాంటివి సర్‌ప్రైజ్ చేయకపోగా చాలా సిల్లీగా అనిపిస్తాయి.
ఒకప్పుడు రజనీకాంత్‌కి మాంఛి ఎలివేషన్లు రాసిన రవికుమార్ ఇప్పుడు బాలకృష్ణకి అందులో ఒకటో వంతు ఎలివేషన్ కూడా ఇవ్వలేకపోయారు. రెండు పాత్రలకీ రెండు ఎంట్రీలుంటే రెండిటినీ అతి దారుణంగా తెరకెక్కించారు. కాన్వాయ్‌లో వెళుతోన్న విలన్‌కి బాలకృష్ణ ఫోన్ చేసి హలో అనగానే డ్రైవర్ అతలాకుతలం అయిపోయి డివైడర్‌ని గుద్దేయడం ఏమి హీరోయిజమో రవికుమార్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అజ్ఞాతవాసి అనే అపర క్లాసిక్ తర్వాత వచ్చిన 'జై సింహా' చాలా బ్యాడ్‌గా వున్నా కానీ సంక్రాంతికి ఇంకో సినిమా లేక గట్టెక్కిపోయింది. అదంతా తమ ప్రతిభే అనుకోవడం వల్ల ఇదిగో ఇలా 'రూలర్'తో బొప్పి కట్టింది.
ఎనభై, తొంభైవ దశకంలో వచ్చినా కానీ ఈ సినిమా ఈ కాలానికి ఒక ఇరవయ్యేళ్లు అవుట్‌డేటెడ్ అనిపిస్తోందని అప్పటి క్రిటిక్స్ రాసేలా వున్న 'రూలర్' 2019లో ఎలా పాస్ అవుతుందని అనుకున్నారో కానీ మాస్ ఆడియన్స్ కూడా ఇలాంటి సీన్స్ చూసి నవ్వుకునే రేంజ్‌కి అప్‌డేట్ అయిపోయారు. ఫాన్స్ అయినందుకు టికెట్ కట్ చేసి కలక్షన్స్‌కి తమ కాంట్రిబ్యూషన్ ఇచ్చినా ఈ టార్చర్‌ని థియేటర్లో కూర్చుని తట్టుకోలేరు. బాలకృష్ణ ఫ్లాప్ సినిమాల్లో కూడా 'కోకోకోలా పెప్సీ' స్లోగన్స్ చెప్పడానికి ఒకటో రెండో ఛాన్స్‌లిస్తుంటారు దర్శకులు. కానీ రవికుమార్ అలాంటి ఒక్క సందర్భాన్ని కూడా ఇవ్వకపోగా థియేటర్ బయట వెయిట్ చేసే ఛానల్స్ వారికి కూడా మొహం చాటేసే సినిమా ఇచ్చాడు.
బాటమ్ లైన్: రబ్బిష్!
గణేష్ రావూరి