కుక్కను తోక ఆడించిన చందంగా… కాంగ్రెస్ పార్టీ ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆడించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది.
నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ తో తమకు అవసరం లేనట్టుగా వ్యవహరించిన మమతా బెనర్జీ.. అప్పుడే కాంగ్రెస్ వచ్చి తమతో కలవొచ్చని బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. తను వెళ్లి కాంగ్రెస్ తో కలిసేది ఉండదని, కాంగ్రెస్ పార్టీనే తనతో వచ్చి కలవాలనేది మమత మాట.
గోవా ఎన్నికలకు తనో కూటమిని కూర్చినట్టుగా ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా జాయిన్ కావొచ్చని మమత ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నిందిస్తూనే.. ఆ పార్టీ తమతో వచ్చి కలవొచ్చని మమత ఆఫర్ ఇవ్వడం గమనార్హం.
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పరచడంలో బిజీగా ఉన్నారు మమత బెనర్జీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో వచ్చిన కాన్ఫిడెన్స్ తో మమత వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోని నేతలను చేర్చుకుంటున్నారు.
బిహార్, మేఘాలయ, గోవా.. ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను ఖాళీ చేయించే పనిలో ఉంది మమత. అయితే కాంగ్రెస్ నే ఆయా రాష్ట్రాల్లో కాపాడలేని నేతలను చేర్చుకుని మమత సాధించేది ఏమిటనేది ప్రశ్నార్థకం.
అలాంటి చేరికలతో తనదే జాతీయ కాంగ్రెస్ అన్నట్టుగా మమత బిల్డప్ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పరచలేమని శరద్ పవార్ లాంటి వారు చెబుతున్నారు మమతకు కూడా! అయితే వారి మాటలను లెక్కజేసే స్థితిలో లేదు మమత.
తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారు. తనే బీజేపీని నేషనల్ లెవల్లో ఓడిస్తాననేంత స్థాయిలో హడావుడి చేస్తున్నారు. మరి తను ఏర్పరిచిన కూటమి బలమెంతో మమతకు బుల్లి రాష్ట్రం గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలియరావొచ్చు!