మోడీని ఢీ కొంటేనే… ?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపైన పోరాటం విషయంలో క్లారిటీ ఒకటి కచ్చితంగా మిస్ అయినట్లుగానే కనిపిస్తోంది. నిజానికి కార్మికులకు ఉన్నపాటి ఆలోచనలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెబుతున్న కొందరు రాజకీయ నేతలకు లేదా…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపైన పోరాటం విషయంలో క్లారిటీ ఒకటి కచ్చితంగా మిస్ అయినట్లుగానే కనిపిస్తోంది. నిజానికి కార్మికులకు ఉన్నపాటి ఆలోచనలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెబుతున్న కొందరు రాజకీయ నేతలకు లేదా అన్న చర్చ కూడా వస్తోంది.

స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ. దాని యాజమాన్యం ఢిల్లీలో ఉంది. మొత్తం కధ అంతా అక్కడ నుంచే ఆపరేట్ అవుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం వైసీపీని కావాలనే  టార్గెట్ చేస్తున్నాయి. దీని మీద ఇంటక్ జాతీయ ఆధ్యక్షుడు సంజీవ రెడ్డి అయితే ఇక్కడ చేసేదేమీ లేదని తేల్చేశారు. ఒక విధంగా ఆయన చెప్పింది రాష్ట్రంలో కూర్చుని ఆందోళనలు చేయడం వల్ల ఉపయోగం లేదనే.

జాతీయ స్థాయిలో ఉక్కు ఉద్యమాన్ని చేపట్టాలని, ఢిల్లీ వేదికగా చేసుకుని పోరాడాలని సంజీవరెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు, ఇంటక్ జాతీయ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అక్కడే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుదని కూడా ఉక్కు కార్మికులకు తాజా పర్యటనలో గట్టి భరోసా ఇచ్చారు.

ప్రధాని మోడీని కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఒత్తిడి తీసుకువద్దామని కూడా ఆయన ఉక్కు కార్మికులకు ధైర్యం చెప్పారు. అదే విధంగా ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని బీజేపీ మీద  పోరాడితే తప్ప ప్లాంట్ ని రక్షించుకోలేమని పేర్కోనడం విశేషం.

మొత్తానికి మోడీని ఢీ కొంటేనే తప్ప ఉక్కును ప్రైవేటు వేటు నుంచి తప్పించలేమని ఈ కురువృద్ధుడైన కార్మిక నేత చెప్పుకొచ్చారు. మరి ఆ పాటి సోయి కొన్ని రాజకీయ పార్టీల నాయకులలో లేకపోవడం వల్లనే ఉక్కు సీన్ కాస్తా గల్లీ పోరాటంగా మారుతోందని, చిల్లర విమర్శలకు కేంద్ర బిందువు అవుతోందని కూడా కార్మిక వర్గాలలో ఆవేదన వ్యక్తం అవుతోంది.