ఒకవైపు అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేటు పెరగగా.. దానికి రివర్స్ లో మూవీ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ రేటును తగ్గించి వేసింది. నెల వారీగా చార్జీలను తగ్గించి వినియోగదారులను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ మూవీ స్ట్రీమింగ్ యాప్.
మొన్నటి వరకూ స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లలో.. నెట్ ఫ్లిక్స్ ను వీక్షించడానికి నెలకు 199 రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఈ ప్యాకేజ్ లో నెట్ ఫ్లిక్స్ నెలవారీ చార్జీ 149 రూపాయలకు తగ్గింది.
ఇక స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లతో పాటు… టీవీ, కంప్యూటర్లలో కూడా నెట్ ఫ్లిక్స్ చూడటానికి ఇది వరకూ 499 రూపాయలు చెల్లించుకోవాల్సి ఉండేది నెలకు. అయితే ఈ ప్యాకేజ్ ధరను బాగా తగ్గించి వేసింది నెట్ ఫ్లిక్స్. ఇక నుంచి 199 రూపాయల ధరకే టీవీ, కంప్యూటర్, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్లలో 480 క్వాలిటీలో నెట్ ఫ్లిక్స్ ను వీక్షించవచ్చు.
ఇక క్వాలిటీ కోసం వెయ్యి రూపాయలు, అంతకు మించి ధర ఉన్న ప్యాకేజ్ ల ధరను కూడా నెట్ ఫ్లిక్స్ తగ్గించింది. 499 రూపాయల ధరకే 1080 స్టాండర్డ్ ప్యాకేజ్, 649కు హెచ్డీ ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది నెట్ ఫ్లిక్స్.
అమేజాన్ తో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ ధర ఇది వరకూ రెట్టింపు ఉన్నా.. అమేజాన్ ప్రైమ్ ధర పెరగడం, ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ రేట్లు బాగా తగ్గడంతో.. రెండు మూవీ స్ట్రీమింగ్ యాప్ ధరలూ దాదాపు ఒకే రేంజ్ కు చేరుతున్నట్టే.