పరామర్శ రివర్స్: వైసీపీ ఎమ్మెల్యే ముందు జాగ్రత్త

అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు తెలివిగా ప్రవర్తిస్తుంటారు, మరికొందరు అతి తెలివి చూపిస్తుంటారు. అంతిమంగా తమ…

అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు తెలివిగా ప్రవర్తిస్తుంటారు, మరికొందరు అతి తెలివి చూపిస్తుంటారు. అంతిమంగా తమ రాజకీయ ప్రయోజనం ఏంటనేదానిపైనే వారు ఫోకస్ పెడతారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు.

ఇటీవల అమరావతి పాదయాత్ర నెల్లూరుకి చేరుకున్న సందర్భంలో ఆయన రైతుల శిబిరంలోకి వెళ్లారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా.. పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం అంటూ వార్తలిచ్చేసింది. ఆయనేమో పాపం వర్షాల వల్ల పాదయాత్ర ఆపిన రైతుల్ని పరామర్శిద్దామన్నట్టు వెళ్లారట, బయట ఆ విషయం చినిగి చాటంతై, చాపంతైంది, అధిష్టానం వద్ద నెగెటివ్ మార్కులు పడ్డాయి. దీంతో సదరు ఎమ్మెల్యే సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

అక్కడినుంచి అనుకోకుండా అమరావతి రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. మిగతా చోట్ల అడుగడుగునా వైసీపీ నేతలు పాదయాత్రను అడ్డుకుని, జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూశారు. ఆ దిశగా సక్సెస్ అయ్యారు.

పాపం కోటంరెడ్డి..

దీంతో సహజంగానే కోటంరెడ్డిపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసి కోటంరెడ్డికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఇవ్వదని, అందుకే ఆయన అమరావతి శిబిరంలోకి వెళ్లి టీడీపీ, బీజేపీ దృష్టిలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే జగన్ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. 

వరుసగా రెండుసార్లు నెల్లూరు రూరల్ లో జెండాపాతిన కోటంరెడ్డిపై జగన్ వ్యతిరేకంగా ఉంటారని కూడా ఎవరూ అనుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని జగన్ దూరం చేసుకుంటారనుకోవడం అవివేకం. అయితే కోటంరెడ్డిపై వేటు పడాలనే ఆశ అధికార పార్టీలోనే కొంతమందికి ఎక్కువగా ఉందనేది మాత్రం వాస్తవం.

ముందు జాగ్రత్తలు..

సహజంగానే ఇలాంటి వ్యతిరేక ప్రచారంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరుకున పడ్డారు. అమరావతి రైతుల పరామర్శ ఎపిసోడ్ తర్వాత గతంలో ఆయన ఓ మహిళా ఎంపీడీవో ఇంటిపైకి దౌర్జన్యానికి వెళ్లారనే వార్తలు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. అంతే కాదు, స్థానికంగా ఉండే టీడీపీ నేతలతో కూడా కోటంరెడ్డి సర్దుబాట్లు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. దీంతో కోటంరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల నేను-నా కార్యకర్త అంటూ ఓ కార్యక్రమం మొదలు పెట్టిన ఆయన.. హఠాత్తుగా దాని పేరు మార్చేశారు. నేను- నా కార్యకర్త అనే పేరుతో జనంలోకి వెళ్తే.. పార్టీ పేరు, జగన్ పేరు ఎక్కడా రాలేదని, ఒకరకంగా ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమేననే ప్రచారం జరిగింది. దీంతో ఆ కార్యక్రమం పేరుని మార్చేశారు. “జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట” అనే పేరుతో ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు.

మొత్తమ్మీద అమరావతి రైతుల పరామర్శ కోటంరెడ్డి సీటు కిందకు నీళ్లు తెచ్చేలా ఉందని నెల్లూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న కోటంరెడ్డి, ఇప్పుడు తన బ్రాండ్ ఇమేజ్ ను పక్కనపెట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.