తెలంగాణలో ఈ నెల 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఖమ్మంలో మాత్రం క్రాస్ ఓటింగ్ ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
అక్కడ టీఆర్ఎస్ గెలిచినప్పటికీ, అనూహ్యంగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి సుమారు 146 ఓట్లు పడినట్టు గణాంకాలు చెబుతున్నారు.
స్థానికసంస్థల ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి తాతా మధుసూదన్ (టీఆర్ఎస్), రాయల నాగేశ్వరరావు(కాంగ్రెస్), స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాస్, కోండ్రు సుధారాణి పోటీ చేశారు. 768ఓట్లకు గాను మొత్తం 738 ఓట్లు పోలయ్యాయి.
నిజానికి కాంగ్రెస్‌కు మొత్తం 116 ఓట్లు ఉండగా, వీరిలో కొందరు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 96కు పడిపోయింది. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపాయి. దీంతో టీఆర్ఎస్‌కు గంపగుత్తగా ఓట్లు పడతాయని అందరూ భావించారు.
బ్యాలెట్ బాక్సులు తెరిచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడంతో స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌పై సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్లోనే వ్యతిరేకత వుందని అర్థమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. అలాగే 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క వ్యూహాత్మకంగా పావులు కదపడంతో కాంగ్రెస్ భారీస్థాయిలో ఓట్లు సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు క్రాస్ ఓటింగ్‌పై టీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తాతా మధు మీడియాకు చెప్పారు.