ఒకే వ్యక్తికి రెండు డోసులు ఇచ్చిన ఘటనలు ఆమధ్య ఇండియాలో చూశాం. కోవిషీల్డ్ ఇచ్చి, ఆ వెంటనే కోవాగ్జిన్ ఇచ్చిన ఘటనలు కూడా చూశాం. కానీ ఇది అంతకుమించి. ఒకే వ్యక్తికి, 24 గంటల వ్యవథిలో ఏకంగా 10 కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ తప్పు అధికారులది కాదు, సదరు వ్యక్తి కావాలనే ఈ పనికి ఒడిగట్టాడు.
న్యూజిలాండ్ లో జరిగింది ఈ ఘటన. ఈ దేశానికి చెందిన ఓ వ్యక్తి తనకు తెలిసిన పలువురి ఐడెంటిటీలు తీసుకొని, వాళ్ల పేర్ల మీద ఒకేసారి 10 కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఒకే సెంటర్ లో టీకా తీసుకుంటే అధికారులు గుర్తుపడతారని భావించి, 10 కేంద్రాల్లో 10 సార్లు టీకాలు తీసుకున్నాడు.
ఒకేసారి ఇన్ని టీకాలు తీసుకుంటే.. తీవ్రమైన అలసట, గుండెనొప్పి, జ్వరం, తలనొప్పి వస్తాయని.. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలతో వ్యక్తులెవరూ చుట్టుపక్కల హాస్పిటల్స్ లో జాయిన్ అయినట్టు డేటా లేదు.
న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. అసలు ఒకే వ్యక్తి, వివిధ కేంద్రాల్లో నకిలీ గుర్తింపులతో వ్యాక్సిన్ తీసుకోవడం సాధ్యమా అనే కోణంలో దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో కొందరు సిబ్బందికి సదరు వ్యక్తి లంచం ఇచ్చి వ్యాక్సిన్ తీసుకున్నట్టు తేలింది.
ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గోప్యంగా ఉంచుతోంది. అసలు అతడు ఎందుకిలా ఒకేసారి 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.