సౌతాఫ్రికా టూర్ కు సిద్ధం అవుతున్న టీమిండియా క్రికెట్ జట్టు విషయంలో బీసీసీఐ ఒక మార్పు వార్తను ప్రకటించింది. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సౌతాఫ్రికా తో టెస్టు మ్యాచ్ లలో ఆడబోవడం లేదని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ కు కండరాలు పట్టేయడం తిరగబెట్టడంతో టెస్టు సీరిస్ వరకూ రోహిత్ దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఇదేదో కాకమ్మ కథలాగానే ఉందని సగటు క్రికెట్ ఫ్యాన్ కు అనిపించవచ్చు. మొన్ననే న్యూజిలాండ్ తో రెండో టెస్టు నుంచి తప్పించేందుకు రహనే విషయంలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. రహనే ను జట్టులోంచి తొలగించడానికి గాయం సాకును వాడుకున్నారనేది బహిరంగ రహస్యంగా నిలిచింది.
ఇక ఇప్పటికే కొహ్లీ కెప్టెన్సీ విషయంలో నానా రచ్చ జరుగుతూ ఉంది. వన్డే కెప్టెన్సీ నుంచి కొహ్లీని తప్పుకోవాలని బీసీసీఐ అల్టిమేటం ఇచ్చింది. అయితే అతడేమో రాజీనామా ప్రకటన చేయడం లేదు! బీసీసీఐనే తనను తప్పించాలని కొహ్లీ నింపాదిగా ఉన్నాడని స్పష్టం అవుతోంది.
చాన్నాళ్లుగా కొహ్లీ, రొహిత్ ల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవనే ప్రచారం ఉండనే ఉంది. ఇక అంతకు మించిన ప్రచారం ఏమిటంటే.. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే ప్రకటన వచ్చాకా, తన వన్డే, టీ20 లనుంచి రిటైర్మెంట్ ప్రకటనను కూడా కొహ్లీ చేయబోతున్నాడనేది! వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించాకా, ఇక తన స్థానం విషయంలో కూడా అనుమానాలు ఉండవచ్చనేది కొహ్లీ లెక్కట!
అయితే.. ఊరించే రికార్డులు ముందున్న నేపథ్యంలో, కొహ్లీ అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడా? అనేది సందేహమే. వన్డేల నుంచి తప్పుకుంటే.. కొహ్లీ కి చాలా రికార్డులు మిస్ అవుతాయి. సరిగా ఆడితే సచిన్ వంద సెంచరీల రికార్డును కూడా కొహ్లీ సవరించగలడు. అదంతా జరగాలంటే.. కొహ్లీ పరిమిత ఓవర్ల మ్యాచ్ లను ఆడాల్సిందే! దీని కోసం తనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా రోహిత్ కెప్టెన్సీలో ఆడాల్సిందే.
తన తర్వాత కెప్టెన్సీ విషయంలో రోహిత్ పేరుకు కొహ్లీ వ్యతిరేకం అని ఇది వరకే స్పష్టం అయ్యింది. పంత్ కో, రాహుల్ కో ఆ బాధ్యతలు దక్కాలని కొహ్లీ ఆర్గ్యూ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే కొహ్లీ చెప్పినట్టుగా బీసీసీఐ వ్యవహరించడం లేదు. వన్డే కెప్టెన్సీ ఉంచి ఆల్మోస్ట్ తప్పించింది. ఇంతలో టెస్టు మ్యాచ్ ల వరకూ రోహిత్ దూరం అంటూ మరో ప్రకటన. వీటిల్లో ఒక దానికీ మరోదానికీ సంబంధం ఉందో లేదో కానీ.. ఒకదాని తర్వాత మరోటి పేర్చి చూస్తే… రోహిత్ వర్సెస్ కొహ్లీ వార్ గట్టిగానే సాగుతోందని అనిపించకమానదు!