ఇక చిన్న సినిమాలకి కాలం చెల్లిపోయింది. ఎవరెన్ని ఆశలు పెట్టుకుని ఎన్ని సినిమాలు తీసినా థియేటర్స్ కి ప్రేక్షకులు వచ్చే పరిస్థితులు దాదాపు లేవు.
ఒకవేళ చిన్న సినిమాలు తీసినా వాటి వెనుక పెద్ద బ్యానర్ల హస్తం ఉంటే కొద్దొ గొప్పో మీడియా సాయం ఉండొచ్చు. “జాతి రత్నాలు” లాంటి సినిమాలు ఈ కోవకు వస్తాయి.
మామూలు ప్రేక్షకుల మాటెలా ఉన్నా క్రమం తప్పకుండా సినిమాలు చూసే యువ ప్రేక్షకులు అటువంటి సినిమాలను ఆదరించి అతి కష్టం మీద పెట్టుబడి వెనక్కొచ్చేలా చేయగలరు. అది కూడా సినిమా బాగుందన్న టాక్ వస్తే.
సినిమా అంటే పెద్ద హీరోలదే. ఇప్పుడు “పుష్ప” కి ఉన్నంత క్రేజ్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా చూడలేదు. దానికి రెండేళ్ల కరోనా కాలం పెద్ద కారణం.
రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ విశేషమైన ప్రజాదరణ ఉండడం ఖాయం. “పుష్ప” తర్వాత పండక్కి “భీంలా నాయక్”, “రాధే శ్యాం”, “ఆర్.ఆర్.ఆర్” వస్తున్నాయి. మూడూ మూడు రకాలు. ఒకటి మాస్ మసాలా రీమేక్ అయితే, మరొకటి ప్రేమకథాచిత్రం. మూడోది రాజమౌళి తీసిన కళాఖండం.
అలాగే ఫిబ్రవరి బరిలో “ఆచార్య”, “ఎఫ్ 3” వస్తున్నాయి.
వరుసపెట్టి వస్తున్న ఈ పెద్ద సినిమాలకి కరోనా అడ్దంకులు లేవు. ప్రేక్షకులు మునుపట్లాగ వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. అయితే ఎంత మంది వస్తారు, ఏ మేరకు కలెక్షన్స్ ఇస్తారనేది వేచి చూడాలి.
ఇక చిన్న సినిమాలైతే ఓటీటీలకే తప్ప దేనికీ పనికిరాని పరిస్థితి దాపురించింది.
అనామకులైన హీరో హీరోయిన్స్ తో కొత్త దర్శకులు తీసే సినిమాలకైతే పరిస్థితి దయనీయం. జనం దృష్టిని ఆకర్షించడం బహు కష్టంగా మారింది.
ఓటీటీలు కూడా హాల్లో విడుదల చేస్తే తప్ప చిన్న సినిమాలని తీసుకోమని షరతులు పెడుతున్నాయి. దీని వెనుక ఒక మతలబు ఉంది.
చిన్న సినిమాల నిర్మాతలు హల్లో తమ సినిమాను విడుదల చేసే క్రమంలో పబ్లిసిటీకి ఖర్చు పెడ్తారు. ఆ సినిమా ఉనికిని నలుగురుకీ తెలియజేస్తారు. తద్వారా తమ ఓటీటీ ప్లాట్ఫాం పై ఆ సినిమా విడుదలైనప్పుడు పబ్లిసిటీ ఖర్చులు కంపెనీకి తగ్గుతాయి.
ఈ పరిస్థితి పెద్ద సినిమాలకుండదు. ఆల్రేడీ వాటిపై ప్రజల్లో క్రేజ్ ఉంటుంది కనుక ఫ్యాన్సీ ఆఫర్స్ తో డైరెక్ట్ రిలీజ్ కి ఓటీటీలు ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడ షరతు సినిమా హాల్లో వెంటనే విడుదల చేయకూడదు. కనీసం తమ ప్లాట్ ఫాం పై వచ్చిన తర్వాత మూడు వారాలైనా ఆగాలని అగ్రిమెంట్స్ ఉంటాయి.
కానీ పెద్ద సినిమాలు హాల్లో విడుదలైతే క్రేజ్ పుణ్యమా అని ఊహించినంత సొమ్మును కొల్లగొట్టొచ్చు. అందుకే “పుష్ప” లాంటి సినిమాలు డైరెక్ట్ ఓటీటీ విడుదలకి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా మొగ్గుచూపవు.
పైగా అల్లు అర్జున్ లాంటి హీరోలకి హాలు దగ్గర అభిమానులు కటౌట్లకి అభిషేకాలు చేస్తేనే స్టార్డం కి అర్థం, పరమార్థం. ఓటీటీల్లో అయితే ఆ వైభవం ఉండదు కదా.
ఇలా ఎలా చూసుకున్నా సినిమా వ్యాపారంలో పెద్ద సినిమాలు ఇంకా పెద్దవౌతున్నాయి. చిన్న సినిమాలు మరింత చిన్నబోతున్నాయి.
అయినా చిన్న సినిమాలు తీసేవాళ్లు తీస్తూనే ఉన్నారు. ఎందుకంటే తీస్తున్న వాళ్ళకి తమ సినిమా గొప్పదని నమ్మకం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా ఎవరి సినిమా వారికి ఒక అద్భుతమే. తక్కిన చిన్న సినిమాల పరిస్థితి ఎదురుకుండా కనిపిస్తున్నా తమ సినిమా మాత్రం పెద్ద రికార్డు సాధిస్తుందని నమ్ముతారు.
మంచి రేటుకు ఓటీటీ లో సేల్ అవుతుందని విశ్వసిస్తారు. హాలుకు కూడా ప్రేక్షకుల్ని రప్పిస్తుందని ఆశలు పెట్టుకుంటారు. కానీ అసలు విషయం ఆ సమయం వస్తే తప్ప బోధపడదు. విడుదలయ్యాక థియేటర్ వద్ద రెస్పాన్స్ చూసి నిర్వీర్యమైపోతారు. ఓటీటీలో బేరం పలక్క దిగాలు పడతారు. అయినా సరే మరో సినిమా తీయడానికి తయారవుతారు.
చిత్రరంగాన్ని నడిపేది నిర్మాతల ఆసక్తి మాత్రమే. ఎంత లాభాపేక్షతో సినిమా తీస్తున్నా ఆ లాభాలు రాకున్నా మరొక సినిమా తీయడమంటే అది బలీయమైన వ్యసనం మాత్రమే. అయితే ఆ వ్యసనం ఎందరి కళాకారుల కడుపులో నింపుతోంది. చిన్న నిర్మాతకి మాత్రం నష్టాలు మిగులుస్తోంది.
అదృష్టాన్ని నాలుగైదు సార్లు పరీక్షించుకుని అప్పటికీ చేతికి తడి అంటకపోతే శాశ్వతంగా సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచన పెట్టుకుంటారు చిన్న నిర్మాతలు. అంతవరకూ తీస్తూనే ఉంటారు.
– శ్రీనివాసమూర్తి