వ్యవహారం ఏదైనా… హైకోర్టు చేరిందంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తుందనేది మెజార్టీ అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం తప్పని తాజా నిర్ణయం నిరూపించింది. కర్నూలులో ఇటీవల రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ మేరకు జీవో 16ను జారీ చేసింది. ఈ జీవో 16 అమలును సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ…. సీఎం ఆదేశాల మేరకు కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు జీవో వచ్చిందన్నారు. ఇది మైనార్టీల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. దీనిని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ… ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్‌కు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించింది.
జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. కార్యాలయాల ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు.
అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించడం గమనార్హం.
అయితే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జగన్ ప్రభుత్వంపై పిల్ కావడంతో, తమకే అనుకూలంగా ఆశించిన పిటిషనర్‌కు చుక్కెదురైంది.
చట్ట పరిధికి లోబడి నిర్ణయాలపై వ్యతిరేక నిర్ణయాలు రావనేందుకు ఇదే ఉదాహరణ. ఏది ఏమైనా వక్ఫ్ కార్యాలయం ఏర్పాటుపై ఆదిలోనే న్యాయస్థానంలో సానుకూల నిర్ణయం రావడం ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.