అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ ను దించేయాలనే అభిశంసన తీర్మానం ఒక సభలో నెగ్గింది. అమెరికన్ ప్రతినిధుల సభలో ట్రంప్ కు వ్యతిరేకంగా పెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. మెజారిటీ ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ట్రంప్ కు లేదని ఓటేశారు. అయితే ఉన్నఫలంగా ట్రంప్ అధ్యక్ష పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఆయన యూఎస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు.
ప్రతినిధుల సభలో ట్రంప్ వ్యతిరేక అభిశంసన తీర్మానం ఆమోదం పొందినప్పటికీ.. సెనేట్ లో మాత్రం అది ఆమోదం పొందే అవకాశం లేదని తెలుస్తోంది. ట్రంప్ వ్యతిరేక డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్నారు. దీంతో అక్కడ అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. అయితే సెనేట్లో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ల మెజారిటీ ఉంది. దీంతో అక్కడ అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు లేనట్టే.
కాబట్టి.. ట్రంప్ పీఠానికి ఇప్పట్లో ఇబ్బంది లేనట్టే అని పరిశీలకులు అంటున్నారు. అయితే కనీసం ఒక సభలో అభిశంసనకు గురైనా.. అది ట్రంప్ కు ఎదురుదెబ్బే. ఒకరకంగా ఆయన విశ్వాసాన్ని కోల్పోయినట్టే. ఈ నేపథ్యంలో ట్రంప్ తనపై అభిశంసన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ మేరకు ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవద్దని ఆ ఘాటు లేఖలో పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల తన ప్రత్యర్థి అయ్యే బైడెన్ కు వ్యతిరేకంగా ట్రంప్ కుట్ర చేశారని, దాని కోసం ఉక్రెయిన్ సహకారాన్ని కూడా ఆయన తీసుకున్నారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.