కేఎస్ రవికుమార్.. బాలకృష్ణతో వరసగా రెండో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా సోసో.. అనే అనిపించుకుంది. కమర్షియల్ గా కొంతవరకూ హిట్ అయ్యింది. సగటు ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఏమీ కాదు. అయినా వీరి కాంబో వెంటనే రిపీట్ అయ్యింది. ఈ సారి కూడా ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ తో వీరిద్దరూ వస్తున్నారు.
ఈ సినిమా విడుదలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఈ దర్శకుడు బాలకృష్ణతో పని చేసిన అనుభవం గురించి చెప్పారు. వీరి కాంబోలో మొదటి సినిమా ప్రారంభం అయినప్పుడు.. ముహూర్తం షాట్ వీడియోల్లో ఒకటి బయటకు వచ్చి వార్తల్లో నిలిచింది. తన అసిస్టెంట్ ఒకరిపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు ఆ వీడియోలో. తన అభిమానులు చాలా మంది మీద బాలకృష్ణ వివిధ సందర్భాల్లో చేయి చేసుకున్నారు. అప్పుడు అసిస్టెంట్ మీద బాలకృష్ణ తన ప్రతాపం చూపించారు.
ఆ తర్వాత కూడా బాలకృష్ణ వివిధ సందర్భాల్లో తన దురుసుతనాన్నే చూపిస్తూ వస్తున్నాడు. అదేమంటే.. తను కొట్టినా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదంటూ బాలయ్య ఒక సారి వ్యాఖ్యానించారు. ఇక బాలకృష్ణ కేవలం అభిమానులు, అసిస్టెంట్ల మీద మాత్రమేనా.. తన సినిమా కోసం పని చేసే దర్శకులు, ఇతర టెక్నీషియన్ల మీద కూడా అలాగే వ్యవహరిస్తారా? అనేది ఒక డౌట్.
ఈ నేపథ్యంలో రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. 'తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే వారిపై బాలకృష్ణ కోపగించుకుంటారు..' అంటూ బాలయ్యతో వరసగా సినిమాలు చేసిన కేఎస్ చెప్పారు. కోపగించుకోవడం అంటే.. ఆ వీడియోలో చూసినట్టేనేమో! అంతే తప్ప ఇతర టెక్నీషియన్ల మీద బాలయ్య చేయిదురుసు ఉండదన్నట్టుగా ఉంది కేఎస్ చెబుతున్న మాట!