ప్రముఖ నటుడు, కమెడియన్, వైసీపీ సభ్యుడు అలీ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతోన్ బీబీ కన్నుమూశారు. కొంతకాలంగా వయసురీత్యా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి, రాజమండ్రిలోని ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు.
తల్లి మరణించే సమయానికి అలీ అక్కడ లేరు. ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ వెళ్లారు. విషయం తెలుసుకొని వెంటనే హైదరాబాద్ బయల్దేరారు. మరోవైపు తల్లి భౌతికకాయాన్ని హైదరాబాద్ కు రప్పించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని మణికొండ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అలీకి తన తల్లి అంటే ప్రాణం. పేదరికంలో ఉన్నప్పుడు తమను తన తల్లి ఎలా పోషించిందనే విషయాన్ని అలీ ఎప్పటికప్పుడు గుర్తుచేసుకునే వారు. అంతేకాదు, సమయం దొరికినప్పుడల్లా తల్లితోనే గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటికే తండ్రి పేరిట పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అలీకి, తల్లి మరణం తీరని గాయం.