నిన్న కన్నాతో…నేడు సోముతో….

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల వైఖరులలో తేడాలు వస్తాయి. విధేయతలు కూడా మారుతాయి. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. తాము భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా నేతలను…

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల వైఖరులలో తేడాలు వస్తాయి. విధేయతలు కూడా మారుతాయి. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. తాము భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా నేతలను చేర్చుకుంటోంది. అలా చేరిన వారు తమ అవసరాలు చూసుకుని జంపింగ్స్ చేస్తూ ఉంటారు.

బీజేపీకి ఏపీ విభాగం ప్రెసిడెంట్ గా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి తలాక్ అనేశారు. తన జీవిత కాల రాజకీయ జీవితంలో అత్యంత ఎక్కువగా విమర్శించిన తెలుగుదేశంతో దోస్తీ అంటున్నారు. అదే రాజకీయ విచిత్రం.

తనతో పాటు చాలా మంది నాయకులు తెలుగుదేశంలో చేరుతారు అని కన్నా ప్రకటించారు. కన్నాను గుంటూరు వెళ్ళి ఆయన నివాసంలో కలసి చర్చలు జరిపిన విశాఖ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆ వెంటనే తన చుట్టూ చేరిన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఏపీ బీజేపీ తీరు సరిగ్గా లేదని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆయన బీజేపీని వీడుతారని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆయన ఈ రోజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తో కలసి విశాఖలో కనిపించారు ఉత్తరాంధ్రా పట్టభద్రుల స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో పాటు ఆయన కూడా పాలుపంచుకున్నారు.

దీనిని చూసిన వారు రాజు గారు బీజేపీలోనే ఉంటున్నారా అని అనుకుంటున్నారు. అయితే కన్నా బీజేపీని వీడి టీడీపీలో చేరడానికి ఆయనకు సీటు మీద ఒక గ్యారంటీ ఇచ్చింది అధినాయకత్వం. ఇక్కడ చూస్తే రాజు గారు తాను పోటీ చేసి గతంలో గెలిచిన విశాఖ ఉత్తరం కోరుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈసారి వేరే చోట నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో టీడీపీలో చేరి ఆ సీటు నుంచి పోటీ చేయాలని రాజు గారు తలపొస్తున్నారు అని అంటున్నారు.

ఆ సీటు విషయంలో టీడీపీలో చాలా మంది కన్ను ఉంది. ఎంపీగా టికెట్ దక్కకపోతే బాలయ్య చిన్నల్లుడు కూడా ఆ సీటు నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో రాజు గారు చేరినా టికెట్ దక్కకపోవచ్చు అని అంటున్నారు. దాంతో సీటు విషయంలో పక్కాగా హామీ వస్తేనే తప్ప సైకిలెక్కకూడదని ఆయన నిర్ణయించుకున్నారు అంటున్నారు. అందుకే ఆయన ఆవేశంగా బీజేపీ మీద ఒకటి రెండు మాటలు అన్నా తిరిగి ఆ పార్టీ నేతలతో చెట్టాపట్టాల్ వేశారని అంటున్నారు.