దసరా..సరదా తీర్చేసేలా వున్నారే!

నాని హీరోగా తయారవుతున్న దసరా సినిమాకు మాంచి బజ్ వుంది. టీజర్ బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసింది. దాంతో అందరి దృష్టి దీని మీద పడింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను…

నాని హీరోగా తయారవుతున్న దసరా సినిమాకు మాంచి బజ్ వుంది. టీజర్ బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసింది. దాంతో అందరి దృష్టి దీని మీద పడింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను గుత్తగా 25 కోట్ల మేరకు నిర్మాత ఎప్పుడో అమ్మేస్తే, దానికి ముఫై రెండు కోట్ల మేరకు మారు బేరానికి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొనుక్కున్నారు. అదీ ఆ సినిమా డిమాండ్. 

అంతా బాగానే వుంది. కానీ సమస్య ఏమిటంటే ఈ సినిమాకు ఇప్పటికే అన్ని ఖర్చులు కలిపి 68 కోట్ల మేరకు లెక్క తేలుతోంది. కానీ ఆదాయం చూస్తే బొటాబొటీ. హోల్ సేల్ గా అమ్మేసారు కనుక ఓవర్ ఫ్లోస్ వచ్చే అవకాశం కూడా లేదు. ఇక మిగిలింది ఒకటే ఆశ. హిందీలో విడుదల చేస్తున్నారు కనుక అక్కడ ఏమైనా రావచ్చు అనే ఆశ.

ఇలాంటి నేపథ్యంలో సినిమా పబ్లిసిటీ ని చేతుల్లోకి తీసుకున్న సంస్థ మరీ కొత్త కొత్త విన్యాసాలు చేస్తూ, భారీ ఖర్చు దిశగా తెర తీస్తోంది. ఐడియాలు వేయడం వరకు బాగానే వుంది. కానీ దాని ఖర్చు సంగతి? నాని 39వ బర్త్ డే. అందుకని 39 సెంటర్లలో తలా థియేటర్ ఎంచుకుని భారీగా పుట్టిన రోజు వేడుకలు చేస్తారట. 

ఇది సినిమా పబ్లిసిటీ కోసమా? లేక హీరో నాని ని ప్రసన్నం చేసుకోవడం కోసమా? పబ్లిసిటీ కోసం అయితే మరీ ఇంత హడావుడి అవసరం లేదు. ఇప్పటికే మంచి బజ్ వుంది కనుక, రెగ్యులర్ ఫార్మాట్ లో కానీ కాస్త బడ్జెట్ కంట్రోల్ తో కానీ వెళ్తే సరిపోతుంది.

ఎంత ఫ్యాన్స్ ను సమీకరించినా, 39 సెంటర్లలో హడావుడి అంటే ఎంతో కొంత నిర్మాతకు బిల్లింగ్ తప్పకపోవచ్చు. అసలే నిర్మాతకు నిర్మాణ వ్యయం ఎక్కువ అయిన నేపథ్యంలో మరీ భారీ పబ్లిసిటీ ప్లానింగ్ లు కాకుండా కాస్త రీజన్ బుల్ గా వెళ్తే బెటరేమో? లేదూ ఈ ఖర్చంతా అభిమానులదే అంటే ఏ గొడవా లేదు. ఆల్ హ్యాపీస్.