మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కామెడీ చేస్తున్నారు. వ్యవస్థల దుర్వినియోగం, విధ్వంసం గురించి చంద్రబాబు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల విధ్వంసంపై తనకు మాత్రమే హక్కు ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, అలాగే ఆ పార్టీ నాయకులపై కేసుల నమోదు నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యవస్థలను దుర్వినియోగం చేయడంపై ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదనే హింస, దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గన్నవరం ఎపిసోడ్లో బాధితులనే నిందితులుగా చేయడం దారుణమని ఆయన వాపోయారు. జగన్ రాజకీయ కక్షసాధింపునకు పోలీసులు పావుల్లా మారుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా సర్కార్ తీరు ఉందని దుయ్యబట్టారు. గన్నవరం విధ్వంసం, పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు.
జగ్గంపేట, పెద్దాపురంలో టీడీపీకి ప్రజాస్పందన చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. టీడీపీకి ప్రజాదరణ చూసి ప్రభుత్వానికి భయంపట్టుకుందని ఓ రేంజ్లో కామెడీ చేశారు. అనపర్తి సభతో జగన్ ఉలిక్కిపడి గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గతంలో తన పాలనలో సాగిన వ్యవస్థల విధ్వంసం గురించి చంద్రబాబు మరిచినట్టున్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష చేపడితే, ఆయనతో పాటు కుటుంబ సభ్యుల్ని పోలీసులను అడ్డు పెట్టుకుని ఎలా హింసించారో అందరికీ తెలుసు. అలాగే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్ని తన పార్టీలో చేర్చుకోవడం వ్యవస్థలను విధ్వంసం చేయడం కిందికి వస్తుందా? రాదా? సమాధానం చెప్పాలనే నిలదీతలు వస్తున్నాయి.
అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఏ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు నిదర్శనమో చంద్రబాబు చెప్పాలని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరిన పాపానికి తోకలు కట్ చేస్తానని వారి వృత్తిని పరోక్షంగా కించపరిచిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో తన అప్రజాస్వామిక పాలన జనానికి బాగా తెలుసనే సంగతిని చంద్రబాబు మరిచిపోవడం వల్లే నేడు బహిరంగ లేఖ రాశారని ప్రత్యర్థులు దెప్పి పొడుస్తున్నారు.