జనసేనాని పవన్‌కల్యాణ్ పదేపదే తనను ఒక్క చోట కూడా గెలిపించలేదని ప్రజలపై నిష్టూరమాడుతుంటారు. కానీ తనను ఎందుకు గెలిపించలేదో ఇప్పటికీ ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. తనను ఎన్నుకోకపోవడం ప్రజల తప్పిదంగా ఆయన భావిస్తున్నట్టున్నారు. ఇదే ఆయన ఆలోచనా ధోరణి అయితే మనం చేయగలిగిందేమీ లేదు. తన రాజకీయ భవిష్యత్‌పై పవన్‌కు లేని బాధ జనానికి ఎందుకుంటుంది.
పవన్‌ను చట్టసభలకు పంపకపోవడానికి ఆయన రాజకీయ పంథానే కారణం. నాయకుల కంటే జనం తెలివైన వాళ్లు. ఎవరేం మాట్లాడినా, అన్నీ వింటారు. నమ్మినట్టు తలూపుతారు. ఎన్నికల్లో తాము అనుకున్నదే చేస్తారు. తనకు ఒక్క సీటు ఇవ్వనది, అలాగే వైసీపీకి 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది ప్రజలే. ప్రజాభిప్రాయం శాశ్వతంగా ఒక్కరి వైపే వుండదు. వాళ్ల మనసులను చూరగొనే నాయకుల పనితీరును బట్టి మారుతూ వుంటుంది.
ప్రజల నాడి తెలుసుకుని, నడుచుకునే వారే నాయకులుగా మనుగడ సాగిస్తారు. పవన్‌కు ఈ విషయాలు అర్థం కాకపోవడం వల్లే ప్రజాభిమానాన్ని పొందలేకపోతున్నారు. తన వ్యక్తిగత అసూయ, ఈర్ష్య, ద్వేషాన్ని ప్రజలపై రుద్దాలనే క్రమంలో పవన్ బొక్కబోర్లా పడుతున్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తన రాజకీయ పంథాను కొనసాగిస్తుండడం వల్లే ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు.
ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంటే తీసుకుందాం. దీన్ని కేంద్రం ప్రైవేటీకరిస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. విశాఖ స్టీల్ కోసం నిన్న పవన్ ఏమన్నారో చూద్దాం….. ‘స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదు. అది జాతి అభివృద్ధికి బలమైన సంకేతం. దేశానికి చాలా కీలకమైన పరిశ్రమ. ఇది సాధారణంగా వచ్చింది కాదు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మందే కాకుండా 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కష్టాలు, పోరాటం చేసి తెచ్చుకున్న పరిశ్రమ. అది ఆంధ్రుల ఆత్మగౌరవం’ అని తెలిపారు.
ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ నిలదీయకపోగా వెనకేసుకు రావడం ఆశ్చర్యంతో పాటు ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇదే సభలో విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరిస్తున్నకేంద్రం గురించి పవన్ ఏమన్నారో కూడా తెలుసుకుందాం.
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తప్పు కంటే.. వైసీపీ ప్రభుత్వం అడగకపోవడం వల్లే తప్పు జరుగుతోంది. వైజాగ్ నుంచి మాట్లాడితే వైసీపీ నాయకులకు వినిపించలేదు. మంగళగిరి నుంచి మాట్లాడితే వినిపిస్తుందనే దీక్ష ఇక్కడ పెట్టాం’
వినిపించాల్సింది ఎవరికి? వినిపిస్తున్నదెవరికి? విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తప్పు లేదా?…ఇవేమైనా మతి ఉన్న వాళ్లు మాట్లాడే మాటలేనా? కేంద్ర ప్రభుత్వం గొంతు కోయడం సరైందే, దాన్ని ప్రశ్నించకపోవడం వైసీపీ ప్రభుత్వ తప్పిదం అన్నట్టుగా ఉంది పవన్ వ్యవహారం. ఇంతకంటే విడ్డూరం మరొకటి వుంటుందా?
పవన్‌ను ప్రజలు ఎందుకు విశ్వసించడం లేదో మరో సంగతి చెప్పుకుందాం.
‘చట్టసభల్లో మాకు బలం ఉంటే ఢిల్లీ వెళ్లి నేనే కేంద్ర పెద్దలతో మాట్లాడేవాడిని. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? చేతకాని వ్యక్తులం కాదని నిరూపించుకోవాలంటే కనీసం పార్లమెంటు సమావేశాల్లోనైనా స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించాలి. వైసీపీ నాయకులకు, 22మంది ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిలబడాలి’ అని పవన్ నిన్నటి సభలో ఆవేశంతో ఊగిపోయారు.
ప్రశ్నించడానికే పార్టీని స్థాపించానని పవన్ అనేక సందర్భంలో తన ఆశయాన్ని ప్రకటించడం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ప్రశ్నించాల్సిన వ్యవస్థల్ని, వక్తుల్ని ప్రశ్నించకుండా, నిలదీయకుండా …ప్రశంసిస్తూ కూచోవడాన్ని జనం చూస్తున్నారు. అందుకే పవన్‌ను మూలన కూచోపెట్టింది. ప్రతిపక్ష నేతగానే ప్రశ్నించకపోతే, రేపు చట్టసభలకు పంపితే మాత్రం జనసేనాని పొడిచేదీ ఏమీ వుండదని జనం ఏనాడో గ్రహించారు.
వైసీపీకి 22 ఎంపీ సీట్లు ఇచ్చారంటే… ఊరికే ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తాను చేయాల్సిన పనంతా చేయడం వల్లే అధికారాన్ని కట్టబెట్టారు. తనలా షూటింగ్‌లకు పరిమితమై జగన్ ఉండలేదు. కుటుంబాన్ని వదిలేసి, ఏళ్ల తరబడి జనంలో ఉన్నారు.
భవిష్యత్‌లో జనసేన ప్రభుత్వం స్థాపిస్తే, ప్రజలు భారీగా మద్దతిస్తే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ స్థాయిలో పని చేస్తాడో చేసి చూపిస్తానని పవన్ నమ్మబలుకుతున్నారు. ఇది కల కనడానికి బాగుంటుంది. అంతే తప్ప ఆచరణకు నోచుకోదు. ఎందుకంటే 2024లో తాను గెలవాలనే తపన కంటే, వైసీపీని గద్దె దింపాలనే పట్టుదలే ఎక్కువగా ఆయనలో కనిపిస్తోంది. ఇలాంటి నాయకులను ఎప్పటికీ జనం ఆదరించరు. 2019లో కూడా ఇదే రకమైన ఎత్తుగడతో ఎన్నికలో బరిలో దిగి పవన్ నట్టేట మునిగారు.
చంద్రబాబుపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని పసిగట్టకుండా, ఇంకా ఆయనే రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరికను మనసులో పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన పవన్‌కు…ప్రజాచైతన్యం ఎంత బలమైందో అవగతమైంది.
బాబుపై ప్రజావ్యతిరేకత, ఆయనతో అంటకాగిన పాపానికి తాను కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఇంకా పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదా? లేక బాబుపై అభిమానాన్ని చంపుకోలేక రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారా? టాలీవుడ్ అగ్రహీరోగా అభిమానుల పొగడ్తలు మాత్రమే తెలిసిన పవన్‌కు, రాజకీయ తెరపై మాత్రం తాను విలనే అని గ్రహిస్తే మంచిది.
అంతెందుకు 2019 ఎన్నికల్లో తన అభిమానులు కూడా తనకు కాకుండా జగన్‌కు ఓట్లు వేశారని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎందుకు అలా చేశారో పవన్ ఏనాడైనా ఆలోచించారా? బాబును ఓడించాలనేది పవన్ అభిమానుల కోరిక కూడా. అందుకు విరుద్ధంగా పవన్ నడుచుకోవడం వల్లే చివరికి తనకు కూడా అభిమానులు ఓట్లు వేయలేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలి.
రాజకీయ తెరపై నటించడానికి ఇదేమైనా సినిమా కాదు. ప్రజాభిప్రాయంతో ముడిపడి ఉన్న రంగం. పెళ్లైతే పిచ్చి కుదురుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ పెళ్లి కావాలంటే పిచ్చి కుదరాలి. ఈ సూత్రం రాజకీయానికి కూడా వర్తిస్తుంది. చట్ట సభల్లో అడుగు పెట్టాలంటే ముందుగా తనపై విశ్వసనీయతను కల్పించాలి. ఆ తర్వాత ఎన్ని విద్యలైనా పడొచ్చు. తన కోసం తాను రాజకీయాలు చేయనంత వరకూ పవన్ చట్టసభల్లో అడుగు పెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు.