మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంటిపై ఏపీ సీఐడీ రైడ్స్ నేపథ్యంలో.. అక్కడ హల్చల్ చేసి, ఆ పై తను అక్కడ ఉండటం వల్లనే రైడ్స్ సాఫీగా జరిగాయని, ఈ విషయంలో సీఐడీ అధికారులే తనకు రుణపడి ఉన్నారన్న.. ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణపై కేసు నమోదు అయ్యింది.
తమ విధులకు ఆటంకాలు కలిగించారనే అంశంపై రాధాకృష్ణపై ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
విశేషం ఏమిటంటే.. తను సీఐడీ విధులకు ఆటంకం కలిగించలేదని, ఒకవేళ ఆటంకం కలిగించి ఉంటే.. తనపై ఈ పాటికి నువ్వే కేసులు పెట్టించి ఉండే వాడివి కదా జగన్.. అంటూ ఆయన తన వీకెండ్ కామెంట్లో తనదైన రీతిలో సవాల్ విసిరారు.
తనపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉందని రాధాకృష్ణే అలా క్లూ ఇచ్చినట్టుగా ఉంది. తనపై కేసులు పెట్టి ఉండేవారు కదా.. అంటూ రాధాకృష్ణ సన్నాయి నొక్కులు నొక్కిన 24 గంటల్లోనే ఆయనపై సీఐడీనే కేసు నమోదు చేసింది.
తను అక్కడ ఉండటం సీఐడీ అధికారులకే మేలని రాధాకృష్ణ ఒకటికి పది సార్లు చెప్పుకున్నాడు. అందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో కూడా సీఐడీ అధికారులు తనను అక్కడే ఉండమన్నట్టుగా రాధాకృష్ణే చెప్పుకున్నారు.
సీఐడీ అధికారులు మాత్రం ఎక్కడా ఆ మాట అనరు. ఆయనే చెప్పుకుంటారు. మొత్తానికి తను ఆటంకం కలిగించి ఉంటే కేసులు నమోదు చేసే వారు కదా.. అన్న రాధాకృష్ణ లాజిక్ కు అనుగుణంగా కేసు నమోదు అయ్యింది. అంటే ఆటంకం కలిగించినట్టే కదా!