అయ్యో ….రామోజీరావు. జగన్ సర్కార్‌ను ఇరికించబోయి, రామోజీ నేతృత్వంలోని ఈనాడు పత్రిక తానే బొక్క బోర్లా పడింది. అసలే జగన్ ప్రభుత్వంపై నిత్యం వ్యతిరేక కథనాలు రాయడమే లక్ష్యంగా ఈనాడు మీడియా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విషయంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో భాగంగా ఈనాడు పత్రిక కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది.
అయితే వైసీపీ ప్రభుత్వంపై ఈనాడు దుష్ప్రచారాన్ని పాఠకులు, ప్రజానీకం వెంటనే పసిగట్టారు. 2021, ఫిబ్రవరిలో పట్టాభి ఫొటోలను తీసుకొచ్చి, తాజా గాయాలుగా ఈనాడు చూపుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆధారాలతో సహా నిరూపించారు. ఈ సందర్భంగా ఈనాడు దుర్మార్గ వైఖరిని నెటిజన్లు ఘాటైన పదాలతో తుక్కు రేగ్గొట్టారు. నెటిజన్ల దెబ్బలకు ఈనాడు అల్లాడిపోయింది. ఈనాడుకు తగిలిన దెబ్బల ముందు… పట్టాభి గాయాలు చాలా చిన్నవనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ… ఆయన శరీరంపై దెబ్బలు చూపుతున్నట్టు ఈనాడు ప్రచురించింది. తీరా చూస్తే, అవి 2021 నాటివని పాఠకులు పసిగట్టారు. దీంతో ఈనాడు పత్రిక అత్యుత్సాహాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎండగట్టారు. ఇది సోషల్ మీడియా కాలమని, ఇక రామోజీ, చంద్రబాబు, పచ్చ మీడియా తిమ్మిని బమ్మిని చేయడం కుదరదంటూ చురకలు అంటించారు.
దీంతో ఈనాడు యాజమాన్య తన తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతిస్తున్నామంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గన్నవరం విధ్వంసం ఘటనలో టీడీపీ నేత పట్టాభిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఈనాడులో వచ్చిన ఫొటోల్లో పొరపాటు జరిగినట్టు ఈనాడు యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. ఈ తప్పు సాంకేతిక కారణాల వల్ల దొర్లినట్టు చెప్పుకొచ్చింది. మొత్తానికి సోషల్ మీడియాలో ఈనాడుపై నెటిజన్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.