అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది, రిసెప్షన్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో రిసెప్షన్ మొదలవుతుంది. ఈలోగా పెళ్లికూతురు గది నుంచి కెవ్వుమని కేక. పెళ్లి కొడుకు తల్లి ఆ రూమ్ లోకి చూసింది. ఇంకేముంది తలుపులు పగలగొట్టి చూస్తే లోపల రక్తపు మడుగులో రెండు శవాలు. నవ దంపతులిద్దరూ చనిపోయి ఆ గదిలో పడి ఉన్నారు.
అసలేం జరిగింది..?
ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో జరిగింది. 24 ఏళ్ల అస్లామ్, 22 ఏళ్ల కహ్కష బానో వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి జరిగే వరకు నవదంపతులు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎవరి రహస్యాలు బయటపడ్డాయో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
అయితే ఆ గొడవ బయటపడనీయలేదు. రిసెప్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నా దంపతులిద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. రిసెప్షన్ కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేరూమ్ లో ఉండగా ఈ దారుణం జరిగింది.
భార్యపై దాడి, భర్త ఆత్మహత్య..
నవదంపతులిద్దరూ రక్తపు మడుగులో ఉండగా, కత్తి భర్త చేతిలో ఉంది. ముందు భార్యను చంపి, ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘోరం చూసి పెళ్లి కొడుకు తల్లి కుప్పకూలింది, బంధువులు కూడా షాక్ కి గురయ్యారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇద్దరూ సంతోషంగా ఉన్నారని, ఈలోగా ఏం జరిగిందో, కత్తితో పొడిచి భార్యను చంపేంత కోపం అస్లామ్ కి ఎందుకు వచ్చింది, ఆ తర్వాత అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం మిస్టరీగా మారింది.
పోలీసులు ఇద్దరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సమాచారం రాబడుతున్నారు. పెళ్లి వేడుకతో సంతోషం వెల్లివిరియాల్సిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.