ఒకరితో బ్రేకప్, మరొకరితో పెళ్లి. ఇలాంటివి చాలామంది జీవితాల్లో సహజం. కానీ బ్రేకప్ తో హర్ట్ అయినవాళ్లు, పెళ్లి రోజు మండపంలోకి వచ్చి గొడవ చేస్తారేమోనన్న భయం చాలామందిలో ఉంటుంది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తమ ఎక్స్ లవర్స్ ఏ రూపంలో కసి తీర్చుకుంటారోనన్న ఆందోళనలో ఉంటారు.
కానీ చైనాలో ఓ వింత ఘటన జరిగింది. ఏకంగా పెళ్లి కొడుకు గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కూడబలుక్కుని పెళ్లి మండపంలోకి వచ్చారు. నీ అంతు చూస్తామంటూ ఓ బ్యానర్ పట్టుకుని మండపం ముందు వరుసలో నిలబడ్డారు. దీంతో పెళ్లి కూతురు షాకైంది, ఏంటిదంతా అని పెళ్లి కొడుకుని నిలదీసింది.
చైనాలోని యునన్ నగరంలో చెన్ అనే ఓ యువకుడు పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే అతడికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారంతా చెన్ పెళ్లి రోజు అతడికి స్పాట్ పెట్టారు. తమని మోసం చేసి, ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న చెన్ కి బుద్ధి చెప్పేందుకు ఓ బ్యానర్ తో రెడీ అయ్యారు. పెళ్లి మండపం ముందు ఈ బ్యానర్ పట్టుకుని హడావిడి చేశారు. మేమంతా పెళ్లి కొడుకు చెన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్. ఈరోజు వాడి పని అయిపోయింది, అతడి బండారం బయటపెడతాం.. అంటూ హెచ్చరించేలా బ్యానర్ పట్టుకుని కలకలం రేపారు.
చెన్ ని నిలదీసిన పెళ్లి కూతురు..
ఇదంతా ఏంటి అంటూ పెళ్లి కూతురు, ఆమె తండ్రి.. చెన్ ని నిలదీశారు. దీంతో అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు చెన్. తెలిసీ తెలియని వయసులో చాలామందితో తాను ప్రేమాయణం వెలగబెట్టానని, అయితే వారందరికీ బ్రేకప్ చెప్పి బాధ పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే ఎక్కడా ఆ అమ్మాయిలను చెన్ తప్పుబట్టలేదు. తనలా ఎవరూ గర్ల్ ఫ్రెండ్స్ ని బాధపెట్టొద్దని, ఒకవేళ వారిని ఇబ్బంది పెడితే, ఇదిగో ఇలా పెళ్లిలో బుక్ అవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు.
తన బాయ్ ఫ్రెండ్ కి వేరే అమ్మాయితో పెళ్లవుతుంటే మూగగా రోదించే వారిని చూసి ఉంటాం, కానీ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కట్టగట్టుకుని చెన్ ని చాకిరేవు పెట్టారు. పెళ్లి మండపం ముందే బ్యానర్ పట్టుకుని వెరైటీగా షాకిచ్చారు.