ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు, బిజెపికి చెందిన రేఖా గుప్తాను 34 ఓట్ల తేడాతో ఓడించి, ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.
ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్ ల మధ్య వివాదం చెలరేగడంతో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని అదేశాలు జారీ చేయడంతో ఇవాళ మేయర్ ఎన్నిక జరిగింది.
గత సంవత్సరం డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కి ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ కు 134 సీట్లు రాగా, బీజేపీ 104, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ సీటు గెల్చుకోవాలన్న బీజేపీకి ఇవాళ ఆప్ విజయం గట్టి షాకిచ్చింది. ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ కు దక్కడంతో.. 15 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది.