కిట్టీ పార్టీల ముసుగులో, అధిక వడ్డీలు ఆశచూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసు ఇంకా కొలిక్కిరాలేదు. వరుసగా రెండోసారి కస్టడీలోకి తీసుకున్నప్పటికీ ఆమె నుంచి సరైన సమాచారం రాబట్టలేకపోయారు పోలీసులు. నిన్నటితో ఆమె 3 రోజుల కస్టడీ ముగిసింది. ఈరోజు శిల్పా చౌదరిని కోర్టులో హాజరుపరిచి, అట్నుంచి అటు జైలుకు పంపించబోతున్నారు.
శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే ఓసారి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పుడు ఆమె నుంచి నిజాలు కక్కించలేకపోయారు పోలీసులు. దీంతో కోర్టు అనుమతితో రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో సమాచారం అందుకోలేకపోయారు. లాయర్లు చెబుతున్న ప్రకారం, శిల్పా చౌదరిని మూడోసారి పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించకోవచ్చు. అదే కనుక జరిగితే ఆమెకు బెయిల్ రావడం పక్కా.
అధిక వడ్డీలు ఇస్తానని, పలు మార్గాల్లో పెట్టుబడులు పెడతానంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ ఆఫీసర్ల భార్యల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసింది శిల్పా చౌదరి. అయితే ఆ డబ్బు ఆమె ఎక్కడ పెట్టిందనే విషయాన్ని మాత్రం పోలీసులు కక్కించలేకపోయారు. ఆమె బ్యాంక్ ఎకౌంట్లలో 16వేలు, ఆమె భర్త ఎకౌంట్ లో 14వేలు మాత్రమే గుర్తించారు.
ఆమెపై పడిన కేసుల ప్రకారం.. ఆమె 7 కోట్ల రూపాయల మేరకు టోకరా వేసినట్టు తెలుస్తోంది. అయితే డబ్బు ఎక్కడుందనే విషయాన్ని చెప్పని శిల్పా చౌదరి, ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి మాత్రం అంగీకరించినట్టు చెబుతున్నారు పోలీసులు. బాధితులు మాత్రం ఆమె 17 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్టు చెబుతున్నారు.
మరోవైపు శిల్పా బ్యాక్ గ్రౌండ్ పై ఆరాతీసిన పోలీసులకు, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంట. అక్కడ మూడేళ్లు పనిచేసి, తర్వాత హైదరాబాద్ లో కూడా కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేసిందట.