టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబంలో అసెంబ్లీ టికెట్ గొడవ జరుగుతోందనే చర్చకు తెర లేచింది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి అఖిలప్రియకు టికెట్ ఇచ్చేది లేదని టీడీపీ అధిష్టానం పరోక్ష సంకేతాల్ని ఇచ్చింది. మరోవైపు భూమా కుటుంబానికి చెందిన మరో యువ నాయకుడిని బరిలో దింపేందుకు టీడీపీ ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అక్కకు టికెట్ రాదని పసిగట్టిన భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి తనను తాను నాయకుడిగా ఆవిష్కరించుకునేందుకు ఎత్తుగడ వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచే తాను పోటీ చేస్తానని తాజాగా జగత్ విఖ్యాత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో భూమా అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వదనే సందేశాన్ని తమ్ముడు జగత్ తీసుకెళ్లినట్టైంది. అక్కను రాజకీయాల నుంచి తప్పించారనే చెడ్డ పేరు లేకుండా, ఆమె స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారనే నర్మగర్భ వ్యాఖ్యలు జగత్ తన సన్నిహితుల వద్ద చేస్తుండడం గమనార్హం.
మరోవైపు ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే, తనను కాదని, బరిలో ఉంటానని జగత్ ప్రకటించడంపై అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. పైగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిలిచేందుకు తగినంత వయసు కూడా లేకపోవడం అడ్డంకిగా మారుతుందని అఖిలప్రియ అంటున్నట్టు తెలిసింది.
అయితే కొంత కాలం క్రితం కిడ్నాప్, ఇతరత్రా నేరమయ సంఘటనల్లో అఖిలప్రియ అరెస్ట్ కావడం, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌లపై కేసులు నమోదు కావడం, బెయిల్ కోసం నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించడం లాంటివి టీడీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. ఇదే సందర్భంలో అఖిలప్రియపై ప్రజల్లో ఆదరణ బాగా తగ్గిందనే సమాచారం టీడీపీ అధిష్టానానికి చేరింది.
అఖిలప్రియతో విభేదించి, బీజేపీలో చేరిన అన్న భూమా కిశోర్‌కుమార్‌రెడ్డి రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల గ్రామ సందర్శన పేరుతో రోజుకో పల్లెను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. భూమా కుటుంబ వారసుడిగా కిశోర్‌ను ఆళ్లగడ్డ జనం అక్కున చేర్చుకుంటున్నారన్న వాస్తవాన్ని కర్నూలు జిల్లాలోని టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి ఉన్న పలుకుబడి దృష్ట్యా , కిశోర్ నాయకత్వానికి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో, రానున్నరోజుల్లో అతనైతేనే సరైన అభ్యర్థి అవుతాడని టీడీపీ అధిష్టానానికి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నీ భూమా అఖిలప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్‌కు కోపం తెప్పిస్తున్నాయి.
మరోవైపు అఖిలప్రియను కర్నూలు టీడీపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కిశోర్ బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో పొత్తులో భాగంగా లేదా టీడీపీ తరపున కిశోరే అభ్యర్థి అవుతారనే ప్రచారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. కిశోర్ మనసులో ఏమున్నదో బయట పడడం లేదు. కానీ ఆయన భూమా వారసుడిగా ఆళ్లగడ్డ నుంచి బరిలో దిగడం తప్పనిసరి అని భూమా వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
అన్నను అడ్డుకునేందుకు అక్కను సైతం తప్పించి తాను బరిలో ఉంటానని జగత్ విఖ్యాత్ తాజా వ్యాఖ్యలు ఆళ్లగడ్డలో చర్చనీయాంశమయ్యాయి. చూద్దాం మున్ముందు కాలం ఎన్నెన్ని మార్పులు తీసుకొస్తుందో!