ఎన్నో ఆశలు, ఆశయాలతో మొదలు పెట్టిన యువగళం పాదయాత్ర లోకేశ్‌కు అనుకున్న స్థాయిలో ప్రచారం తీసుకోరాలేదు. ప్రతి రోజూ ఏదో ఒక అంశం తెరపైకి వస్తుండడంతో లోకేశ్ పాదయాత్ర మరుగున పడుతోంది. అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. అడుగడుగునా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం జరిగింది. దీంతో చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యం దక్కింది.
ఆ తర్వాత తారకరత్న మృతి. మహాశివరాత్రి రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల ప్రచారంలో మీడియా మునిగిపోయింది. మరోవైపు లోకేశ్ పాదయాత్ర వరుసగా మూడు రోజులు నిలిచిపోయింది. అనంతరం 23వ రోజు లోకేశ్ పాదయాత్ర మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
దీంతో శ్రీకాళహస్తి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను స్థానిక నేతలు తప్ప, మరెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ తర్వాత పట్టాభిపై పోలీసుల దాడి, అనంతర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా ఏపీ రాజకీయాలన్నీ గన్నవరం, పట్టాభి కేంద్రంగా సాగుతున్నాయి. ఈ అంశాలపైనే ఎల్లో మీడియా చానళ్లు కూడా చర్చలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సీరియస్ ఎపిసోడ్‌తో లోకేశ్ పాదయాత్రకు టీడీపీ అనుకూల మీడియాలో కూడా ప్రచారం దక్కని దుస్థితి. లోకేశ్ పాదయాత్ర ఎల్లో పత్రికల్లో లోపలి పేజీల్లోకి వెళ్లిపోయింది. ఈనాడు పత్రికలో కనీసం జిల్లా సంచికలో కూడా మొదటి పేజీలో లోకేశ్‌కు స్థానం కల్పించకపోవడాన్ని చూస్తే… పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో లోకేశ్ నడక టీడీపీకి ఏదో మేలు చేస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి.
లోకేశ్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ శ్రేణులు నిరాశతో నిట్టూర్చుతున్నాయి.