టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకునేవారికంటే దుర్వినియోగం చేస్తూ దుర్మార్గాలకు పాల్పడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అసలు ఇలా కూడా మోసం చేస్తారా, ఇలా కూడా జనాలు మోసపోతారా అనుకునేంతలా కొత్త తరహా మోసాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. జాతకం చెబుతామంటూ ఆడవారి నగ్నచిత్రాలు సేకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసిన ముఠా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది. అసలు సూత్రధారికోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.
మోసం ఎలా జరిగిందంటే..?
హస్తరేఖలు, పుట్టు మచ్చల ఆధారంగా మీ జాకతం చెబుతాం, దోషాలుంటే మేమే సవరిస్తాం, మీ జాతకాన్ని అద్భుతంగా మార్చేస్తామంటో ఓ ముఠా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మహిళలకు టోకరా వేసింది. దీనికోసం తాము పుట్టుమచ్చల శాస్త్రాన్ని ఆధారం చేసుకుంటామని, మీ పుట్టుమచ్చల వివరాలు చెబితే దాని ప్రకారం జాతకం తయారు చేస్తామని నమ్మబలికారు మోసగాళ్లు. జాతకం చెప్పడానికి, జాతకం చెప్పిన తర్వాత తమకు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దన్నారు. జాతకం మారి కనకవర్షం కురిస్తేనే అందులో తమకు కొంత ఇస్తే చాలన్నారు.
ఇక్కడే మహిళలు బోల్తా కొట్టారు. ముందుగా డబ్బులు అడగటంలేదు, తమకు డబ్బులు వస్తే, ఆ తర్వాత అందులో కొంత భాగం అడుగుతున్నారు, ఇదేదో బాగుంది కదా అని టెంప్ట్ అయ్యారు. పుట్టుమచ్చల వివరాలు చెప్పేశారు. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మీ పుట్టుమచ్చల లొకేషన్ సరిగా చెప్పలేకపోతున్నారు. అవి ఎక్కడున్నాయో మాకు ఫొటో తీసి పంపించండి, లేదా వీడియో తీసి పంపించండి అని మోసగాళ్లు మహిళలను కోరారు. ఇంకేముంది, అమాయక మహిళలు, తమ ఒంటిమీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీడియోలు తీసి పంపించారు. అలా అర్ధ నగ్న వీడియోలు పంపించి అడ్డంగా బుక్కయ్యారు. ఆ వీడియోలు అడ్డు పెట్టుకుని వారు బ్లాక్ మెయిలింగ్ కి దిగారు.
ముఖ్యంగా పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే మహిళలు, గృహిణులు.. వీరి వలలో పడ్డారు. ఆ తర్వాత నగ్న చిత్రాలున్నాయని బ్లాక్ మెయిల్ చేయడంతో భయపడి కొంత డబ్బు ముట్టజెప్పారు. కొంతమంది మగవారు కూడా వారి బుట్టలో పడ్డారని తెలుస్తోంది.
జైనుద్దీన్, రాములు అనే ఇద్దరిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు సూత్రధారులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. పుట్టుమచ్చల పేరుతో నగ్న వీడియోలు సేకరిస్తున్న ముఠా వ్యవహారం బయటడపడటం ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.