త్వరలో జనసేనాని పవన్‌కల్యాణ్ బాబు-భువనేశ్వరి ఓదార్పు యాత్ర చేపట్టనున్నారా? అంటే… ఔనని నెటిజన్లు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. నిన్న పవన్‌కల్యాణ్ తన రాజకీయ ఆరాధ్య దైవం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరికి తీవ్ర పరాభవం జరిగిందని వాపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓదార్పు యాత్ర అంటూ వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావం పేరుతో ఆదివారం మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌కల్యాన్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
దీక్ష ముసిసిన అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ… చట్టసభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారంటే చాలా బాధ అనిపించిందన్నారు. చట్టసభ శాసనాలు చేసే సభ అన్నారు. అక్కడ బూతులే శాసనాలు అయినప్పుడు.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ప్రతిపక్ష నేతను, ఆయన సతీమణిని ఆ స్థాయిలో తిడితే.. రాష్ట్రంలో ఆడబిడ్డకు, మహిళలకు రక్షణ ఉంటుందా..? అని ఆయన ఆక్రోశంతో ప్రశ్నించారు.
అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన సతీమణిపై ఎలాంటి దూషణలకు పాల్పడలేదని వైసీపీ ఎమ్మెల్యేలు పదేపదే చెబుతున్నారు. అయినప్పటికీ తాను అన్నదే నిజమని నమ్మించేందుకు చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారని వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పిందే నిజమని, ఎల్లో మీడియా రాసిందే వేదమని భావించిన పవన్‌కల్యాణ్ తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మరి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పట్టుకుని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర అభ్యంతరకర దూషణలకు పాల్పడితే మాత్రం పవన్‌కు వినసొంపుగా ఉందా? మీడియా మీట్లో జగన్ తల్లిని తూలనాడిన టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై పవన్ ఎందుకు మాట్లాడలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు.
జగన్ తల్లిని పట్టాభి తిట్టిన దానికి కౌంటర్‌గానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోటికి పని చెప్పారు. మాజీ మంత్రి మాధవరెడ్డితో సంబంధాలను అంటగట్టి, ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదంతా పూర్తిగా అసెంబ్లీ బయట జరిగింది. అది తెలిసి కూడా తెలియనట్టు నటించే పవన్ రాజకీయ తెరపై కూ ఇరగదీస్తున్నారనే సెటైర్స్ కు తక్కువ ఏముంటుంది?.
విశాఖ ఉక్కు కార్మికుల సంఘీభావ దీక్ష ముగిసిందని, క్రిస్మస్ సెలవులకు రష్యా వెళ్లి …తిరిగి వచ్చిన తర్వాత కొత్త ఏడాదిలో బాబు-భువనేశ్వరి జంటను ఓదార్చే యాత్ర పెట్టొచ్చని వ్యంగ్య పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. బాబు ప్రాపకం కోసం మరీ ఇంత దిగజారాలా పవన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.