టాలీవుడ్ కు సంబంధించి ఏ సినిమా ప్రమోషన్ అయినా దాదాపు ఒకే విధంగా సాగుతుంది. మహా అయితే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రత్యేక అతిథులు మారుతుంటారంతే. కానీ ప్రభాస్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇలాంటి రొటీన్ ప్రచారంతో పాటు మరో ప్రత్యేకమైన ప్రచారం ఊపందుకుంటుంది. అదే జపాన్ ప్రచారం.
అవును.. బాహుబలి నుంచి ప్రభాస్ కు జపాన్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. బహుశా.. రజనీకాంత్ తర్వాత జపాన్ లో ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ కు మాత్రమే ఉందేమో. ప్రభాస్ కోసం జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన అభిమానులు కూడా ఉన్నారు. ప్రభాస్ తో సెల్ఫీలు దిగి, ఆనందంగా తిరిగి జపాన్ వెళ్లిపోతుంటారు చాలామంది.
ప్రభాస్ కు సంబంధించి ఏ సినిమా రిలీజైనా, జపాన్ అభిమానులు యాక్టివేట్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. రాధేశ్యామ్ సినిమా కోసం కూడా జపాన్ ఫ్యాన్స్ సీన్ లోకి ఎంటరైపోయారు.
తమదైన స్టయిల్ లో సినిమాకు ప్రచారం చేస్తున్నారు. తెలుగు, హిందీ వెర్షన్ పాటల్ని పాడుతూ పోస్టులు పెడుతున్నారు. రాధేశ్యామ్ డిజైన్లను తామే గీసి పబ్లిష్ చేస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ కు జపాన్ భాషలో రివ్యూలు పెడుతున్నారు.
తెలుగులో మరే హీరోకు ఈ ప్రత్యేక ప్రచారం ఉండదు. కేవలం ప్రభాస్ కు, అతడి సినిమాలకు మాత్రమే సొంతమైన ఎలిమెంట్ ఇది. ఇంతకీ రాధేశ్యామ్ సినిమా జాపనీస్ సబ్-టైటిల్స్ తో రిలీజ్ అవుతోందా?