మొత్తానికి “అఖండ” హడావిడి ఆగింది. కాదు.. ఇక చాల్లే అని ఆపబడింది. ఎందుకంటే ముందు నుంచీ ఈ సినిమాని ఒక వర్గం ప్రెస్టీజ్ ఇష్యూ గా తీసుకోవడం బాలయ్యకి, బోయపాటికి విపరీతంగా కలిసొచ్చింది.
చంద్రబాబు ఏడ్చిన వేళా విశేషం కావొచ్చు, తమ వర్గంపై పాలక పక్షం చూపిస్తున్న పైచేయి కావొచ్చు, రాజకీయంగా పైకి ఎగరడానికి రెక్కల్లో బలం సన్నగిల్లడం వల్ల కావొచ్చు…ఆ కసినంతా బాలయ్య సినిమాని పైకి లేపడంలో చూపించారు ఆ వర్గం వారు.
అమెరికాలోని అత్యంత ధనవంతుడి నుంచి, అనకాపల్లిలాంటి ఊరిలో ఉన్న ఒక సాధారణ వ్యక్తి వరకు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా అనుకుని పన్నాగం ప్రకారం చేసింది కాదు. ఆ వర్గం ఐకమత్యానికి, ఆత్మగౌరవానికి ఇదొక నిదర్శనం. ఎవరికి ఎవరూ తెలియకపోయినా ఇది “మావోడి” సినిమా అనే కులభక్తి ఈ సినిమాని విజయాల లిస్టులోకి నెట్టింది.
విడుదలైన రోజు నుంచీ అమెరికా, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూల్, విశాఖ, అనంతపురం, తిరుపతి అన్న తేడాలు లేకుండా కుదిరినన్ని బల్క్ బుకింగులు చేసి జనానికి ఉచితంగా టికెట్లు పంచారు. టికెట్ పుచ్చుకున్నవారు సినిమా చూసినా చూడకపోయినా నష్టం లేదు. టికెట్ తెగింది కాబట్టి అది కలెక్షన్స్ లోకి చేరిపోతుంది.
బల్క్ బుకింగుల భాగోతాన్ని పక్కనపెడుతూ, ఇదంతా పాలకపక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి సంకేతమని ప్రచారాలు కూడా చేసుకున్నారు ఆ వర్గం మీడియా. కానీ అదేంటో కలెక్షన్స్ నైజాం, అమెరికాలో ఎక్కువ నమోదయ్యాయి ఆంధ్రలో కన్నా. పాలకపక్షానికి వ్యతిరేకతైతే ఆంధ్రలో ప్రతాపం చూపించాలి కానీ తెలంగాణలోనూ, అమెరికాలోనూ ఏం పని?
అసలు అమెరికాలో బాలయ్య సినిమాలు ఆడవు. పైగా హింసాత్మక చిత్రాలు అమెరికాలో అసలు ఆడవు. అల్లు అర్జున్ “సరైనోడు” కూడా హింస వల్లే అమెరికాలో బోర్లా పడింది. అలాంటిది అఖండ కలెక్షన్ ని చందాలేసుకునైనా 1 మిలియన్ డాలర్స్ కు చేర్చాలని అక్కడి ధనిక కులభక్తులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతటి ఐక్యత, ఇంతటి వర్గభక్తి నిజంగా స్ఫూర్తిదాయకమే. ఈ విషయంలో బాలకృష్ణ నిజంగా అదృష్టవంతుడే.
మరి ఇలాంటి సీన్ మునుముందు మెగా సినిమాలకి కూడా కొనసాగుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఆ వర్గంలో ధనికులు బయటికి రారు. బయటికొచ్చి హడావిడి చేసే వాళ్ల దగ్గర డబ్బుండదు. హల్లో న్యూస్ పేపర్లు కత్తిరించి విసరడం తప్ప అభిమానాన్ని బల్క్ బుకింగ్స్ తో చాటుకునే శక్తి ఆ సేనకి లేదు మరి.
ఈ విశ్లేషణంతా పక్కన పెడితే బాలయ్య మాత్రం తన విజయరహస్యం తన బొటనవేలుకి పెట్టుకున్న ఉంగరంలో ఉందని మరింత బలంగా నమ్ముతుండవచ్చు. ఆ ఉంగరాన్ని “అఖండ” విజయం కోసమే మంత్రించి ధరించారని లోపలి సమాచారం.
ఎంతటి నాస్తికులకైనా బాలయ్యని చూస్తే జాతకాల్ని, రత్నశాస్త్రాన్ని నమ్మాలేమో అనిపించొచ్చు.
లేకపోతే “అఖండ” కి వర్గాభిమానంతో విజయం దక్కడమేంటి? 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఊడ్చుపెట్టుకుపోయినా బాలయ్య గెలవడమేమిటి? ఏ కేసులూ తనని ఇబ్బంది పెట్టకపోవడమేమిటి? బహిరంగంగా ఎవర్ని చేయి చేసుకున్నా, ఎంతమందిని నోరు చేసుకున్నా తన ప్రభ తగ్గకపోవడమేమిటి? అంతా తావీజు మహిమలాగ జాతకాలపై బాలయ్య విశ్వాసబలం కూడా కారణం కావొచ్చేమో.
హరగోపాల్ సూరపనేని