ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న జగన్ సంకల్పం నత్తనడకన సాగుతోంది. మూడు నెలల సమయం ఉందని తెలుస్తున్నా.. వాస్తవానికి లబ్ధిదారుల ఎంపిక దగ్గరే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పథకం పక్కదారి పట్టడం మాట అటుంచి, అవసరం ఉన్నవారికి కూడా స్థలాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు.
ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం నిబంధనలు తయారు చేసిన ఉన్నతాధికారులు మాత్రం వాటిని మార్చడానికి ససేమిరా అంటున్నారు. ఇటు గ్రామస్తులు మాత్రం జగన్ తమకిచ్చిన హామీ నెరవేర్చడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అవసరమైతే ప్రైవేట్ స్థలాలు కొని అర్హులందరికీ కేటాయిస్తామని ప్రభుత్వం తరపున మాటిచ్చారు.
ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే.. ఆయా శాఖలకు నిధులు తక్కువయ్యాయి, బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ స్థలాలనే వెతికిపట్టుకుని మరీ వాటిని లబ్ధిదారులకు కేటాయించాల్సిన పరిస్థితి.ఈ క్రమంలో 2-3 గ్రామాలకు సంబంధించిన వారందరికీ ఒకేచోట స్థలాలను చూపించాల్సి వస్తోంది.
కొంతమంది అగ్రవర్ణాల వారు, ఎస్సీ, ఎస్టీ కాలనీల దగ్గర స్థలాలు ఇస్తామంటున్నా వద్దంటున్నారు. ప్రభుత్వం మాకు కొనిస్తామంటుంది కదా మధ్యలో మీ ఇబ్బంది ఏంటి అని అధికారులను నిలదీస్తున్నారు. అటు స్థలాలు కొనడానికి డబ్బులు లేక, ఇటు తాము చూపించిన స్థలాలను లబ్ధిదారులు తీసుకోడానికి ఇష్టపడకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మరోవైపు లబ్ధిదారుల పేరుతో కరెంటు కనెక్షన్ ఉండకూడదు, పొలం ఉండకూడదు అనే నిబంధనలు ఉండటంతో.. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటూ సొంత ఇళ్లు లేని చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యలన్నిటినీ సరిదిద్ది ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు సిద్ధం చేయాలంటే అధికారులకు తలకు మించిన పనిగా మారుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగితే జగన్ ఆశయం సంపూర్ణంగా నెరవేరు.