రికార్డు తిరగేసిన పవన్ కల్యాణ్!

సినిమాల్లో పవన్ కల్యాణ్ ఎన్నో రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా అదే పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన రికార్డులు తిరగరాయడం లేదు, చెప్పిన రికార్డుల్ని తిప్పితిప్పి తిరగేస్తున్నారు. అరిగిపోయిన ఆ…

సినిమాల్లో పవన్ కల్యాణ్ ఎన్నో రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా అదే పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన రికార్డులు తిరగరాయడం లేదు, చెప్పిన రికార్డుల్ని తిప్పితిప్పి తిరగేస్తున్నారు. అరిగిపోయిన ఆ పాత రికార్డుల్నే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నారు.

దీక్ష పేరిట మరోసారి మీడియా ముందుకొచ్చిన జనసేనాని, స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పిందే చెప్పారు, చేసిన డిమాండే మళ్లీ చేశారు.

అసలు పవన్ కల్యాణ్ ఏం అనుకుంటున్నారు..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. పూర్తిగా కేంద్రం పరిథిలో ఉన్న అంశం. కేంద్రం దీన్ని ప్రైవేటు పరం చేస్తామంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు దాన్ని వ్యతిరేకించింది. చట్టబద్ధంగా ఏం చేయాలో అన్నీ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపింది. పార్లమెంట్ లో తమ ఎంపీలతో నిరసన తెలియజేసింది. 

స్వయంగా ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. చివరికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేసిన రాస్తారోకోలకు కూడా మద్దతిచ్చింది ఏపీ సర్కారు. ఓ ప్రభుత్వం ఇంతకంటే ఇంకేం చేయాలి. ప్రభుత్వమే రోడ్లపైకొచ్చి ధర్నాలు చేయాలా? ముఖ్యమంత్రి రోడ్డుపైకొచ్చి పాదయాత్ర చేయాలా? అసలు పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారు..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక రోజు దీక్షకు కూర్చున్న పవన్ కల్యాణ్, ఈరోజు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. కేవలం ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడానికి మాత్రమే దీక్షకు కూర్చున్న ఈ ఏకాకి రాజకీయనాయకుడు, అనుకున్నట్టుగానే అన్నంత పని చేశారు. ఆయన ఏమన్నారు.. దానికి వివరణలు వరసగా చూద్దాం..

1. ఆరోపణ – రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుంది? అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లండి?

వివరణ – పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణకు పైన చెప్పుకున్న పారాగ్రాఫే పెద్ద వివరణ. రాజ్యాంగానికి లోబడి ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఇంకేం చేయాలో పవన్ కల్యాణ్ చెబితే బాగుంటుంది. బహుశా.. ఆయన సినిమాల్లో చూపించినట్టుగా బారికేడ్లు తన్నేసి, పోలీసుల్ని చితక్కొట్టేసి, తుపాకీ చేత్తో పట్టుకొని హల్ చల్ చేయాలేమో.  

2. ఆరోపణ – చేత‌కాని వ్య‌క్తులు చట్ట‌స‌భ‌ల్లో కూర్చుంటే ఏంలాభం. అధికారంలో ఉండి స్టీల్‌ప్లాంట్‌తో మాకు సంబంధం లేదంటే ఎలా?

వివరణ – స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేదని ఎవడు చెప్పాడు. ప్రభుత్వం పోరాటం చేయలేదని గుండెల మీద చేయి వేసుకొని జనసేనాని చెప్పగలరా? ఇక చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చంటే ఏం లాభం అంటూ ఆరోపించారు పవన్. అందుకే, జనసేన నుంచి ఒక్కర్ని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టలేదు ప్రజలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పవన్ మాట్లాడితే బాగుంటుంది.

3. ఆరోపణ – వైసీపీ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి లేదు. ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన నాకే కేంద్రం గౌర‌వం ఇస్తుంటే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి మీరేం చేస్తున్నారు?  త‌ప్పు కేంద్రానికి కాదు.

వివరణ – ఇక్కడ కూడా సొంత డబ్బా వదల్లేదు పవన్ కల్యాణ్. ఒక్క ఎమ్మెల్యేని గెలిపించినందుకు కేంద్రం ఇతడికి ఎర్రతివాచీ వేసి గౌరవిస్తోందట. కేంద్రంలో ఇతనికి ఏపాటి గౌరవం ఉందో ఆమధ్య అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నించినప్పుడే అందరికీ తెలిసింది. కిందామీద పడి కొంతమందిని కలిసొచ్చారు. 

బీజేపీతో పొత్తు పెట్టుకొని మరీ, గౌరవం లేకుండా బతుకుతున్నది పవన్ కల్యాణ్. ఈ విషయం జనసేన పార్టీలో ఏ కార్యకర్తను అడిగినా చెబుతాడు. ఒక్క బీజేపీ నేత అయినా పవన్ కల్యాణ్ కు గౌరవం ఇస్తాడా? ఆయన మాట వింటాడా? ఇంతోటిదానికి మళ్లీ కేంద్రానికి తప్పు కాదంటూ మరో సమర్థన.

4. ఆరోపణ – నేను వెళ్లి కేంద్రంలో గొడ‌వ పెట్టుకోవాల‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

వివరణ – మిమ్మల్ని వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోమని ఎవరన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా కేంద్రాన్ని ప్రశ్నించమని మాత్రమే వైసీపీ నేతలు అడుగుతున్నారు. కేంద్రం ప్రైవేటైజేషన్ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ఏంటని మాత్రమే అడుగుతున్నారు. 

వైసీపీని, జగన్ ను ఇన్ని మాటలు అనేబదులు, అదే దీక్షలో ప్రధాని మోడీని ఓ మాట అడగొచ్చు కదా. ఆయన్ను తిట్టనవసరం లేదు, కనీసం రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఆ పని కూడా చేయని పవన్ కు దీక్ష ఎందుకు? తప్పదన్నట్టు ఒక్క ముక్కలో కేంద్రాన్ని కోరి, మిగిలిన 99 మాటల్ని వైసీపీని తిట్టడానికి కేటాయిస్తే ఎలా?

అసలు నీ మాట ఎందుకు వినాలి పవన్?

అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లమని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపైకొచ్చి ఉద్యమం చేయాలంటున్నారు. పవన్ చెబుతున్నవన్నీ వినడానికి బాగున్నాయి. ఈయన మాటల్ని కాసేపు పక్కనపెడితే.. అసలు పవన్ మాటల్ని ఎందుకు ప్రభుత్వం వినాలి. ఏ హోదాలో పవన్ ఈ డిమాండ్లు చేస్తున్నారు. 

అసెంబ్లీకి ఒక్కగానొక్క ఎమ్మెల్యేని పంపించినందుకే పవన్ కు అంత ఉంటే.. అంతకంటే ఎక్కువ ఎమ్మెల్యేలున్న చంద్రబాబుకు ఇంకెంత ఉండాలి. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పవన్ కల్యాణ్ మాటను ప్రభుత్వం వింటే, అంతకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేల్ని కలిగిన చంద్రబాబు మాటలు ఇంకెన్ని వినాలి. అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ మాటల్ని, ప్రభుత్వం ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి.

ఇవన్నీ పక్కనపెడితే.. ఈ రోజు దీక్ష పేరిట వార్తల్లో కనిపించిన పవన్… మళ్లీ ఎప్పుడు రాజకీయ ముఖచిత్రంపై కనిపిస్తారో ఆ పార్టీ జనాలకే తెలియదు. ఇలాంటి నేత మాటల్ని పట్టించుకునే కంటే, ఆ అరిగిపోయిన రికార్డుని మరోసారి విని ఊరుకోవడం బెటర్.