జనసేనాని పవన్‌కల్యాణ్ విశాఖ ఉక్కు కార్మికుల సంఘీభావ దీక్ష పేరుతో చేపట్టిన వైఎస్ జగన్ విద్వేష దీక్ష ముగిసింది. దీక్ష అనంతరం పవన్‌కల్యాణ్ ప్రసంగించారు. మొత్తం ప్రసంగంలో విశాఖ ఉక్కును పరిరక్షించడం కోసం తానేం చేస్తాడో చెప్పడం మాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసు వెళ్లగక్కడం గమనార్హం.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించిన మోడీ సర్కార్‌ను ప్రశ్నించడానికి మాత్రం పవన్‌కల్యాణ్‌కు దమ్ము లేకపోయింది. గాజువాకలో ఓడిపోయినా, ఉత్తరాంధ్రలో గెలవలేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ప్రజాక్షేమం కోరుకున్న పార్టీగా జనసేన జనం కోసం నిలిచిందన్నారు. వైసీపీ నేతలు జనసేనకు శత్రువులు కాదంటూనే, శత్రువులు కూడా వెళ్లగక్కని స్థాయిలో వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం ఈ మీటింగ్ ప్రత్యేకత.
విలువలు లేని వైసీపీకి రాజ్యాంగం విలువ తెలియదన్నారు. కానీ తనకు ప్రజా బలం ఉన్నట్టు పవన్‌కల్యాణ్ తనకు తానుగా ప్రకటించుకోవడం విశేషం. చట్టసభల్లో తనకు బలం లేదన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారన్నారు. చేతగాని వాళ్లు చట్టసభలో ఎందుకు? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకుంటామని పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు. అందరూ కలిసి వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయక పోతే వాళ్లు మాట వినరని పవన్ అన్నారు. జనసేనకు మద్దతిస్తే తాను చేసి చూపిస్తానన్నారు. 2024 ఎన్నికల వరకు వైసీపీ గూండాయిజం, బూతులు భరించాల్సిందే అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాకోసం తాను పోరాడితే జనం మద్దతివ్వలేదన్నారు. 2014లో తనను ఒక ఐడియలిస్టిక్ ఫూల్‌గా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ సదుద్దేశంతో వ్యవసాయ చట్టాలు చేశారని ప్రశంసించారు. ప్రజలు వ్యతిరేకిస్తే 3 చట్టాలను వెనక్కి తీసుకుని మోదీ క్షమాపణ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులు పాదయాత్రలో జై అమరావతితో పాటు జై ఆంధ్ర అని నినదించాలని పవన్ సూచించారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలని పవన్ కోరారు.
కనీసం 2024లో బీజేపీ-జనసేన కూటమిని బలపరచాలని కోరలేని దయనీయ స్థితి పవన్‌కల్యాణ్ ప్రసంగంలో కనిపించింది. కేవలం జగన్‌ను తిట్టిపోయడానికి మాత్రమే విశాఖ ఉక్కు కార్మికుల సంఘీభావం పేరుతో దీక్ష చేపట్టారని జనానికి అతని ప్రసంగం కళ్లకు కట్టింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మాట మాత్రం కూడా విమర్శ చేయకపోవడాన్ని గమనించొచ్చు. 2019లో టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని చావుదెబ్బ తిన్న పవన్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదని తాజా ప్రసంగం ద్వారా నిరూపితమైంది.
జగన్‌పై రగులుతున్న ద్వేషాగ్నే తన రాజకీయ జీవితాన్ని కాలి బూడిద చేస్తుందని పవన్ గుర్తించకపోవడం అతని రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించని తనను కార్మికులు నమ్ముతారని భావించడంలోనే ఆయన అమాయకత్వం, మూర్ఖత్వం స్పష్టంగా బయటపడ్డాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనాని అజ్ఞానమే టీడీపీకి శ్రీరామ రక్ష.