వెన్నుపోటును, చంద్రబాబును విడదీసి చూడలేం. రాజకీయాల్లో వెన్నుపోటు పదం వినిపిస్తే ఓయ్ అని పలికే రకం చంద్రబాబు. అలాంటి నేత, ఇప్పుడు తనను కొంతమంది వెన్నుపోటు పొడుస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. బీద అరుపులు అరుస్తున్నారు. ఎవరూ ఊహించని సీన్ ఇది. విధి విచిత్రం ఇది. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
కుప్పంలో తనను వెన్నుపోటు పొడిచారంటూ వాపోతున్న చంద్రబాబుపై పంచ్ ల వర్షం కురిపించారు విజయసాయి. లీడర్ ఎలా ఉంటే, క్యాడర్ అలానే ఉంటుందని.. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనే నానుడిని ప్రస్తావించారు.
“పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్నుపోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్ కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా బాబూ?”
ఇలా బాబు కోవర్టు వ్యాఖ్యలపై సెటైరిక్ గా స్పందించారు విజయసాయి. మరోవైపు ఎన్నడూలేనిది కొత్తగా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ఎత్తుకోవడాన్ని కూడా విజయసాయి తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా అంశంతో చంద్రబాబు మరో నాటకానికి తెరదీశారని విమర్శించారు.
“ఉన్న నలుగురుని కాపాడుకోవడానికి రాజీనామాలకు సిద్ధమా అంటూ చంద్రబాబు మరో నాటకానికి తెరతీశాడు. 2019 నుంచీ ఈ ఉడతఊపులే. తాను, తనవాళ్లతో రాజీనామాలు చేయించి బలమేంటో చూపించుకోవాలి గానీ, మీరు చేస్తే మేం చేస్తామనే మెలికలేంటి? రెఫరెండం కోరితే ఉన్నదీ ఊడుతుంది.”
చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు విజయసాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి బాబుకు విరుచుకుపడుతున్న ఈ ఎంపీ, తాజాగా తన మాటల దాడిని తగ్గించారు. మళ్లీ ఇన్ని రోజులకు బాబుపై సెటైర్లతో 'ఐయామ్ బ్యాక్' అనిపించుకున్నారు.