లోకేష్ ను ఓడించే నాయకుడు దొరికాడు

తన కుమారుడు లోకేష్ ను మంత్రిని చేయాలని టీడీపీ నాయకులు పట్టుబడితే తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ను మంత్రిని చేశారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణలో బాబు ప్రత్యర్థి కేసీఆర్…

తన కుమారుడు లోకేష్ ను మంత్రిని చేయాలని టీడీపీ నాయకులు పట్టుబడితే తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ను మంత్రిని చేశారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణలో బాబు ప్రత్యర్థి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను మంత్రిని చేయడంతో మీ కొడుక్కు ఏం తక్కువ? ఆయన్ని కూడా మంత్రిని చేయాలని కొందరు మంత్రులు పట్టుబట్టారట.

సరేనని మంత్రిని చేశాక ఏదో ఒక చట్ట సభలో సభ్యుడిగా ఉండాలి కదా. అందుకని ఎమ్మెల్సీని చేశారు బాబు. ఇందుకు కారణమేమిటంటే ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి అవకాశం లేదు. అయితే లోకేష్ కోసం సీటు ఖాళీ చేయడానికి కొందరు తమ్ముళ్లు పోటీబడ్డారు. మంత్రి అయ్యాక ఓడిపోతే పరువు పోతుందనే భయంతో బాబు లోకేష్ ను ఎమ్మెల్సీని చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యే కోసం నిలబెట్టారు.

కానీ లోకేష్ ఓడిపోయాడు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయాడు కాబట్టి వేరే చోటు నుంచి పోటీ చేయవచ్చని కొందరు టీడీపీ నాయకులు ఊహించారు. కానీ లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేసి సత్తా చాటుతాడట. దీంతో అతన్ని ఓడించడానికి వైసీపీ ఇప్పటికే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓడిపోవడం, రాజధాని నియోజకవర్గంలో ఓడిపోవటంతో లోకేష్ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమం‌లోనే అతను వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.

అయితే, ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నాడు. దీంతో  వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తాడని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నాడని  పార్టీ వర్గాలు అంటున్నాయి.ఒకవేళ లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఓడించేందుకు ఇప్పటి నుండే వైసీపీ ప్రణాళిక రచిస్తోంది.

ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా ఊతమిస్తోంది. మంగళగిరిలో  చేనేత వర్గం ఎక్కువ. మంగళగిరి నుండి ఎవరూ గెలవాలన్న వారి మద్దతు అవసరం. ఇందులో భాగంగానే చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తారని భావించిన తరుణంలో అనూహ్యంగా మురుగుడుని ఎంపిక చేశారు. 

లోకేష్ మరోసారి పోటీ చేస్తే ఓడించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి లోకేష్ రెండో సారైనా ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుస్తాడా చూడాలి.