జగన్ నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసే విధానాలు కానీ కొన్నిసార్లు ఊహలకు కూడా అందవు. ఆయనకు ఎందుకు ఈ ఐడియా వచ్చిందో తెలియదు కానీ.. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక విజయవంతమైన ఐడియా ఆచరణలో పెట్టారు జగన్.
జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ.. వీరితో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..వీరందరితో కలిసి రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా రౌండ్ టేబుల్ విందు ఏర్పాటు చేశారు.ఈ విందు గురించి ముందే ప్రకటించినా.. ఈ స్థాయిలో జరుగుతుందని, అన్ని జిల్లాలకు అంత టైమ్ కేటాయిస్తారని ఎవరూ ఊహించ లేదు.
మూడు రాజధానుల ప్రకటనతో ప్రతిపక్షాలు రగిలిపోతుండే సరికి.. మీడియా పెద్దగా ఈ విందుకి ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. కానీ అదో అద్భుత ఘట్టం, అద్భుత ఆలోచన అంటున్నారు విశ్లేషకులు.సహజంగా.. జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ ఎస్పీతో సీఎం సమావేశమవుతుంటారు.
అందరూ ఆ సమయంలో అందుబాటులో ఉంటారని చెప్పలేం. ఇక డీజీపీ, చీఫ్ సెక్రటరీ ని కూడా అక్కడ ఊహించలేం. అయితే అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు జగన్. పక్కా ప్లానింగ్ తో 13 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమావేశమయ్యారు జగన్.
ఒక్కో టేబుల్ కి 15 నిమిషాలకు తక్కువ కాకుండా సమయాన్ని కేటాయిస్తూ సంబంధిత జిల్లాపై చిన్నపాటి సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల్ని ఒకేచోట కూర్చోబెట్టి.. సీరియస్ వాతావరణంలో కాకుండా విందులో భాగంగా చాలా అంశాల్ని చర్చించారు ముఖ్యమంత్రి. క్యాజువల్ టాక్ కాబట్టి.. చాలా సమస్యలు తెరపైకి వచ్చాయి, అలాగే వాటి పరిష్కారాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి.
ఒకరిద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాల్ని కూడా ఈ విందులోనే రాజీ అయ్యాయని సమాచారం. మొత్తమ్మీద గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని ఓ కొత్త రకం కార్యాచరణను అమల్లోకి పెట్టారు జగన్. 13 జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాలను ఒకేచోట ముగించారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ఇది మంచి బాండింగ్ ను ఏర్పరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు