పౌరసత్వ సవరణల చట్టం అమలు విషయంలో తగ్గేది లేదని ప్రకటించారు కేంద్ర హోం మంత్రి, అధికార భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ఈ చట్టం అమలు విషయంలో అనేక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతూ ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు. అమలు చేసి తీరేదే అంటూ ఆయన అంటూ ఆయన ప్రకటించడం గమనార్హం.
ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారు వ్యతిరేకించుకోవచ్చని, వారిపై చర్యలు ఉండవని, అయితే హింసాత్మక నిరసనలు తెలిపే వారిపై మాత్రం చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.
ఇక ఈ చట్టం పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రస్తావన తెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే.. పాకిస్తాన్ వాళ్లకు పౌరసత్వం ఇస్తామంటూ ప్రకటించాలని మోడీ సవాల్ విసిరారు. ఈ అంశంపై సీతారాం ఏచూరీ తీవ్రంగా స్పందించారు. మన దేశ సమస్య గురించి పక్క దేశం ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించారు. మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అని, అలాంటప్పుడు ఈ అంశం గురించి పాక్ ను బూచి చూపడాన్ని ఆయన ఆక్షేపించారు.
పౌరసత్వాల విషయంలో మతపరమైన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు ఈ విషయం గురించి మాట్లాడాలని ఆయన అన్నారు.