ఈ తాయిలంతో.. సవాలు మరచి సయోధ్య కుదిరేనా!

మజ్లిస్ పార్టీ తమకు అధికారికంగా మిత్రపక్షం కాకపోయినప్పటికీ.. వారితో స్నేహబంధాన్ని నిత్యం కొనసాగిస్తూ ఉండే భారాస.. వారికి తాజాగా తాయిలం అందించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీని బరిలోకి…

మజ్లిస్ పార్టీ తమకు అధికారికంగా మిత్రపక్షం కాకపోయినప్పటికీ.. వారితో స్నేహబంధాన్ని నిత్యం కొనసాగిస్తూ ఉండే భారాస.. వారికి తాజాగా తాయిలం అందించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీని బరిలోకి దించకుండా, మజ్లిస్ అభ్యర్థికే పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో కూడా అప్పటి తెరాస మద్దతుతో ఈ స్థానాన్ని మజ్లిస్ దక్కించుకుంది. అదే మాదిరి ఈ దఫా కూడా మద్దతివ్వాలని కోరడంతో కేసీఆర్ అంగీకరించారు. ఈ నిర్ణయంతో గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి మజ్లిస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన మీర్జా రహ్మత్ బేగ్ కొత్తగా ఎమ్మెల్సీ కాబోతున్నారు. 

అయితే గతంలో మాదిరిగా, ఈ స్థానాన్ని మజ్లిస్ కు త్యాగం చేయడం వెనుక భారాస వ్యూహం పెద్దదేననే అభిప్రాయం విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఇలాంటి తాయిలం వారికి ఇవ్వడం వలన.. ఇటీవలే శాసనసభ సాక్షిగా ఇరు పార్టీల మధ్య ముదిరిన సవాళ్లు- ప్రతిసవాళ్ల వాతావరణం శాంతిస్తుందనే వ్యూహం ఉన్నట్టు చెబుతన్నారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్- మంత్రి కేటీఆర్ మాటా మాటా అనుకున్నారు.

అక్బరుద్దీన్ కు ఎక్కువ సమయం కేటాయించడాన్ని ప్రశ్నించిన కేటీఆర్ ఏడుగురు సభ్యలున్న వారికే అంత టైమా? అని ఎద్దేవా చేశారు. దీనికి ప్రతిగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాస్త సీరియస్ ఎఫర్ట్ పెట్టి.. యాభై స్థానాల్లో పోటీచేస్తామని, కనీసం 30 గెలుస్తామని సవాలు విసిరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. మజ్లిస్ కు నియోజకవర్గాల్లో పడగల ఓట్లన్నీ భారాసకు పడేవే. వారే గనుక యాభై స్థానాల్లో నేరుగా పోటీచేస్తే ఆ మేరకు భారాసకు పెద్దనష్టమే వాటిల్లుతుంది. వారు 30 గెలవండం కూడా జరిగితే గనుక.. ఇక సంకీర్ణమే తప్ప మరో గత్యంతరం ఉండదు. 

ఈ నేపథ్యంలో.. మజ్లిస్ సవాళ్లను మరచిపోయేలా చేయడానికి, మునుపటి తరహాలో స్నేహబంధం, సయోధ్య కుదిరేలా చేయడానికి ఈ ఎమ్మెల్సీ స్థానం తాయిలంగా ఇవ్వడం ఉపయోగపడుతుంది. ఇంకో కోణంలో చూసినప్పుడు.. భారాస దేశవ్యాప్తంగా పోటీచేయాలని ఆశిస్తున్నప్పుడు.. ముస్లిం ప్రాబల్యం ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది. ఆ ఓటు బ్యాంకు ఖచ్చితంగా బిజెపియేతర పార్టీలకే పడుతుంది గనుక.. భారాస కాస్త ఓటు శాతం సంపాదించుకోవచ్చు. అలాంటి చోట్లు ముస్లిం ఓటు బ్యాంకు ఉన్నదనే ఉద్దేశంతో మజ్లిస్ కూడా రంగంలోకి దిగితే.. భారాసకు దక్కే ఓటుశాతమే సన్నిగిల్లుతుంది. 

ఇలాంటి దేశవ్యాప్త అవసరాలను దృష్టిలో పెట్టుకుని గమనించినప్పుడు.. హైదరాబాదు ఎమ్మెల్సీ స్థానం అనేది.. మజ్లిస్ కు కేసీఆర్ ఇస్తున్న అతి చిన్న కానుక అని పలువురు విశ్లేషిస్తున్నారు.