రాజకీయాల్లో భౌతిక దాడులను ఎవరూ హర్షించరు. రాజకీయాలు విధానాలు, సిద్ధాంతాల పరంగా సాగాలని పౌర సమాజం కోరుకుంటుంది. కానీ అలాంటి ఉన్నత ఆదర్శాలు మన సమాజంలో లేవనేది వాస్తవం. అలాగని దాడులను స్వాగతించేంతగా సమాజం దిగజారలేదు. అదేంటో గానీ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విషయంలో మాత్రం సమాజాభిప్రాయం కాస్త భిన్నంగా వుంది.
కాసేపు వ్యవస్థ అభిప్రాయాన్ని పక్కన పెడితే, టీడీపీలో మెజార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు. “మా పట్టాభిని పోలీసులు కుళ్లపొడిచారు. పొద్దున లేచినప్పటి నుంచి నోరు పారేసుకునే మా వాడికి ఆ మాత్రం మర్యాద సబబే” అని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డు అంటూ మనసులో మాటను మీడియా ప్రతినిధులు, సన్నిహితుల వద్ద వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పట్టాభిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వార్తలపై టీడీపీలో ఎక్కువ మంది ఆనందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
దీన్నిబట్టి పట్టాభిపై టీడీపీలో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో బాగా మాట్లాడుతున్నాడనే కారణంతో చంద్రబాబు, లోకేశ్ ఆయన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీన్ని అలుసుగా తీసుకున్న పట్టాభి పార్టీలో తాను తప్ప, ఇతరులు ఎదగకూడదనే రీతిలో అణచివేత చర్యలకు దిగారు. మీడియాధిపతులు, కీలక జర్నలిస్టులతో సత్సంబంధాలు పెట్టుకుని, తాను చెప్పిన వాళ్లనే టీవీ డిబేట్లకు పిలవాలని షరతు విధించినట్టు టీడీపీ అధికార ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
పట్టాభి శీతకన్ను వేయడంతో కొందరు టీడీపీ నేతలు అసలు ప్రచారానికి నోచుకోని దుస్థితి. అలాగే పార్టీ నేతలపై ఆయన మాట తీరు అభ్యంతరకరంగా ఉందని చెబుతున్నారు. ఇటీవల తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గించాలని అనధికార నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అందుకే లోకేశ్ పాదయాత్రకు సంబంధించి పట్టాభికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
గన్నవరంలో కూడా పట్టాభి అనవసరంగా తలదూర్చడం వల్లే పార్టీ కార్యాలయంపై దాడికి కారణమైందనే ఆగ్రహం టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. పట్టాభితో పాటు 13 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిలో కేవలం ఆయన్ను మాత్రమే పోలీసులు చితక్కొట్టారంటే అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు తమ అక్కసు వెళ్లగక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అధిష్టానం దృష్టిలో పడాలని టీడీపీలో కొత్త సంప్రదాయానికి పట్టాభి శ్రీకారం చుట్టారనే విమర్శలున్నాయి.
తన మాదిరి మాట్లాడితేనే పార్టీ కోసం బాగా పనిచేసినట్టని పరోక్షంగా ఇతర నేతలపై ఒత్తిడి పెంచడానికి పట్టాభి తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. పట్టాభి నోటి దురుసుకు ఈ మాత్రం ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందే అని టీడీపీ నేతలే అంటున్నారు. అలాగని బహిరంగంగా పట్టాభిపై తమ వ్యతిరేకతను ప్రదర్శించలేని పరిస్థితి. పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగ వార్తల పుణ్యాన, ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న చేదు నిజం బయటపడుతోంది.