అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కాలంటే ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంకెన్ని థర్డ్ డిగ్రీ దెబ్బలు తినాలి? అనే చర్చకు తెరలేచింది. చూడ్డానికి పట్టాభి ముద్దొస్తారని, కానీ ఆయన మాటలు వింటే తన్నాలనిపిస్తుందని ప్రత్యర్థులు అంటుంటారు. ఒక్కోసారి అనుకున్నంత పని చేస్తుంటారు కూడా. ఆర్జీవీ మాత్రం ఆయనకు రసగుల్ల అని ముద్దు పేరు పెట్టారు. ప్రస్తుతం ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా… పట్టాభి రాజకీయ విద్యలన్నీ టికెట్ కోసమే అనేది జగమెరిగిన సత్యం. చాలా తక్కువ సమయంలోనే టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. జాతీయ అధికార ప్రతినిధి హోదాను దక్కించుకున్నారు. ఇటీవల తనకు తానుగానే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించుకున్నారు. అంతటితో ఆగలేదు, గన్నవరంలో తానే పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశాడీ… జాతీయ అధికార ప్రతినిధి.
దీంతో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి ఈయన గారి అతి వాగుడే కారణమైందనే అభిప్రాయం ఆ పార్టీలో వుంది. ఈ నేపథ్యంలో తాను అక్కడికి వెళ్లడం, పోలీసులు తీసుకెళ్లిన సంగతి తెలిసింది. సీన్ కట్ చేస్తే… తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ముఖానికి టవల్ చుట్టి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట తన గోడు వెల్లడించారు. కోర్టు వద్ద తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వాచిపోయిన చేతిని, అలాగే కాళ్లను ఆయన చూపారు.
ప్రత్యర్థులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలతో చంద్రబాబు, లోకేశ్ గుడ్‌లుక్స్‌లో పడేందుకు ఆయన వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నారనే చర్చ టీడీపీలో సాగుతోంది. ఇందులో కొంత వరకూ ఆయన సక్సెస్ అయ్యారు. ఇంతా చేసి ఆయనకు టికెట్ దక్కుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పట్టాభికి ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం లేదు. ఏదో ఒక చోట ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు.
కానీ పట్టాభి మీడియాలో మాట్లాడ్డానికి తప్ప, ప్రత్యక్ష రాజకీయాలకు పనికి రారనేది టీడీపీ నేతల అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఎవరితోనూ సఖ్యతగా వుండరని అంటుంటారు. తనకు టికెట్ దక్కే వరకూ ఇలా నోరు పారేసుకోవడం, పోలీసులో లేదా ప్రత్యర్థులో తీసుకెళ్లి కుమ్ముతూనే వుండాలా? అనేది చర్చనీయాంశమైంది. టికెట్‌పై క్లారిటీ ఇస్తే… పట్టాభి మౌనం పాటించడమో లేదా పద్ధతిగా నడుచుకోవడమో, ఏదో ఒక మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.