శృంగారం ఈ మాటే ఉత్తేజాన్ని ఇస్తుంది! శృంగారం పట్ల ఆసక్తి కావొచ్చు, యావ అనొచ్చు.. ఇది మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది! తరచి చూడాలి కానీ మనిషి జీవితానికి ఆరంభమే శృంగారంతో కాదు, మనిషి తను తీసుకునే ఎన్నో నిర్ణయాల్లోనూ, తను పెట్టుకునే జీవిత లక్ష్యాల్లో కూడా శృంగారం పాత్ర ఉంటుంది! డైరెక్టుగా కాకపోవచ్చు.. సటల్ గా.. శృంగారం మనిషి మనుగడనంతా నిర్దేశిస్తుంది! మరి ఇలాంటి శృంగారం చాలా సొసైటీల్లో వివాహంతోనే ముడిపడుతుంది. వివాహంతోనే శృంగార జీవితం ఆరంభంఅనుకుంటే.. .సొసైటీలో వివాహానికి కొన్ని అర్హతలున్నాయి! చదువుకుని ఉండాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆస్తులుండాలి.. వీటన్నిటి కోసం ఎంతో కష్టపడి ఉండాలి! ఇంకో కోణంలో చూస్తే.. అందమైన శృంగార జీవితం కోసం మనిషి ఇవన్నీ సాధించాలనమాట! చదువు, ఉద్యోగం, ఆస్తి.. వీటన్నింతో ఎన్నో రకాల ఆనందాలు దక్కవచ్చు. వాటిల్లో శృంగారం కూడా ఒకటని అందంగా చెప్పుకోనూవచ్చు!
ఆ సంగతలా ఉంటే.. ఇంత కష్టపడి సాధించిన వైవాహిక శృంగారం కూడా బోర్ కొట్టే పరిస్థితి వస్తుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మోహించి పెళ్లి చేసుకున్నా.. కొంత కాలం తర్వాత వైవాహిక శృంగారం అనాసక్తితో కూడుకున్నది అవుతుందా? అంటే.. సెక్సాలజిస్టులు అయినా, రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్ అయినా.. ఔను అనే అంటారు!
మనిషికి ఏదైనా రొటీన్ గా చేస్తే దాని పట్ల అనాసక్తి ప్రబలడం లేదా, అది బోర్ అని ఫీల్ కావడం సహజమైనట్టే, వైవాహిక శృంగారం కూడా అందుకు మినహాయింపు కాదని వారు చెబుతుంటారు. మరి మన సొసైటీలో అయినా, మరో సొసైటీ అయినా బోర్ కొడుతోందని వైవాహిక జీవితం నుంచి బయటకు రావడం కానీ, మరో సంబంధాన్ని చూసుకోవడం కానీ తేలికా కాదు, అది చాలా రిస్క్ తో కూడుకున్నది కూడా! మరి ఏం చేయాలంటే.. వైవాహిక జీవితంలోనే శృంగారం పట్ల కొత్త ఆసక్తిని రేకెత్తించుకోవడం ఉత్తమమార్గమని వారు చెబుతారు. అందుకు వారు కొన్ని టిప్స్ కూడా చెబుతారు.
సెక్స్ కంటూ ఒక షెడ్యూల్!
వినడానికి అన్ రొమాంటిక్ గానే ఉన్నా.. సెక్స్ షెడ్యూల్ అను పెట్టుకోవడమే మంచిదని వారు అంటున్నారు. ఉద్యోగం, వృత్తిలో బిజీగా ఉండటం, ఇంట్లో పిల్లలు, పెద్దలు ఉండటం.. వీటన్నింటి మధ్యనా.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సెక్స్ కంటూ ఒక షెడ్యూల్ పెట్టుకుంటే మిగతా సమయాల్లో దాని గురించి ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవచ్చని వీరు సూచిస్తున్నారు!
ఎంతసేపూ మీరే అడగొద్దు!
శృంగారాసక్తిని ఎంతసేపూ దంపతుల్లో ఒకరే ఎక్స్ ప్రెస్ చేయడం సరికాదనేది వారి సలహా. అవతలి వారి నుంచి స్పందన వ్యక్తం అయ్యి, వారే ఆసక్తి చూపే వరకూ కూడా వెయిట్ చేయడం మంచి అనుభవానికి అవకాశం ఇస్తుందని చెబుతున్నారు!
శృంగారం అంటే కలయికే కాదు!
శృంగారం అంటే కచ్చితంగా శారీరకమైన కలయిక మాత్రమే కాదనేది వారు చెప్పే మాట. శృంగారం అంటే స్పర్శ, అది చుంభనమే కావొచ్చు, ఓరల్ సెక్స్ వరకూ వెళ్లొచ్చు, తనువుల స్పర్శే కావొచ్చు.. అది కూడా శృంగారమే అని గుర్తుంచుకోవాలంటున్నారు1
వాతావరణం మారాలి!
దాంపత్య జీవితంలో ఎన్వైర్ మెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఒకే ఇంటికి, గదికి పరిమితం అయ్యే తత్వం వైవాహిక జీవితంలో సెక్స్ పట్ల అనాసక్తికి దారి తీస్తుందని, అది కేవలం శృంగారం పట్లే కాదు, పరస్పరం కూడా నచ్చకపోవడానికి కారణం అవుతుందని అంటున్నారు. అప్పుడప్పుడు ఏ డేట్ కో వెళ్లినట్టుగా ఇద్దరూ కొత్త చోట కాసేపైనా గడపడం శృంగారం పట్ల కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడం ఖాయమని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు!
ఆ ఆసక్తిని చూపాల్సిందే!
ఒక వయసుకు వచ్చాకో, బోలెడంత అనుభవం తర్వాతో సెక్స్ కు శరీరం కూడా తరచూ సహకరించకపోవచ్చు! అయితే అలాంటి సమయంలో కూడా పార్ట్ నర్ ఎక్స్ పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి! వాటిని గుర్తుంచుకోవాల్సిందే! లైంగిక కలయిక కాకపోయినా.. కనీసం రొమాంటిక్ టచ్ ను అయితే పార్ట్ నర్ ఎప్పుడూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఈ సెన్స్ ఆఫ్ టచ్ లేనప్పుడే పార్ట్ నర్ పై వివాహితుల్లో బాగా అసహనం పెరుగుతుంది అని కూడా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. శృంగారం అనేది కేవలం శారీరక సమర్థతతో సంబంధం ఉన్నది కాదు, మనసు, ఆలోచనే అసలైన శృంగార అనుభవాలను ఇవ్వగలదు అనేది మాత్రం నిజం!