తెలుగు సినిమాని ప్రేమించేది ఎవరు?

సినిమా అనేది వ్యాపారాత్మక కళ అని కొందరు, కళాత్మక వ్యాపారం అని ఇంకొందరు అంటుంటారు. కానీ ప్రస్తుత బడా తెలుగు సినీ హీరోలకి మాత్రం ఇది పూర్తిగా వ్యాపారమే. ధానాశకి కడుపు నిండడమంటూ ఉండదు.…

సినిమా అనేది వ్యాపారాత్మక కళ అని కొందరు, కళాత్మక వ్యాపారం అని ఇంకొందరు అంటుంటారు. కానీ ప్రస్తుత బడా తెలుగు సినీ హీరోలకి మాత్రం ఇది పూర్తిగా వ్యాపారమే. ధానాశకి కడుపు నిండడమంటూ ఉండదు. ఎంత సంపాదించినా “ఇంకా ఇంకా” అంటూ అగ్నిదేవుడి ఆకలిలాగ మండుతూనే ఉంటుంది. సినీరంగంలో హీరోల ఆకలి కూడా అలాగే ఉంది. 

అయితే వీరిలో ప్రధానంగా రెండు రకాలున్నారు. ఒకటి రవితేజ తరహా. రెండు జూ ఎన్.టి.ఆర్ తరహా. 

ముందుగా రవితేజ పద్ధతి గురుంచి చెప్పుకుందాం. కథ, కాకరకాయ, కొత్తిమీర అనవసరం. అడిగినంత రెమ్యునరేషనిచ్చే నిర్మాత దొరికితే చాలు. తద్దినం భోక్తల్లాగ కోట్లు మింగేయడానికి రెడీ అయిపోవడమే. ఇంకో పాయింటేంటంటే వీళ్లకి టాప్ స్లాట్ దర్శకులక్కర్లేదు. ఎందుకంటే తక్కువ జీతం తీసుకునే దర్శకుడైతే తామే ఎక్కువ తినొచ్చని. అన్ని విధాలుగా నిర్మాతకి ఖర్చు తగ్గించి ఆ తగ్గినమొత్తాన్ని తమ రెమ్యునరేషన్లో కలిపేసుకునే దయాహృదయులు ఈ టైపు హీరోలు. ఈ పద్ధతిలో వరసుగా నాలుగైదు సినిమాలు చేసేయడం, అందులో ఏ ఒక్కటి హిట్టైనా అమాంతం ఐదారు కోట్లు రెమ్యునరేషన్ పెంచేయడం. ఆ వరసగా చేసే సినిమాలకు కూడా ప్రతి సినిమా రెమ్యునరేషన్ కి కనీసం కోటి పెంపుదల ఉండేలా చూసుకోవడం…ఇదీ వ్యవహారం. ఈ ఫార్ములాకి ఆద్యుడు రవితేజ. అందుకే ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. ఈ మార్గంలో చాలామంది హీరోలు నడుస్తున్నారు. 

మరి డబ్బిచ్చే నిర్మాతలు ఎలా దొరుకుతున్నారని అడగొచ్చు. ఇక్కడంతా పర్సెప్షన్ మీదే నడుస్తుంది. సదరు హీరో సినిమా బడ్జెట్ పెరిగిపోదు. పైన చెప్పుకున్నట్టు ఇతరత్రా ఖర్చులు, జీతాలు, లొకేషన్స్ తగ్గించేసి..అలా సేవ్ చేసిన మొత్తాన్ని హీరోగారి బుజ్జిపొట్టలో వేస్తారంతే. కనుక మార్కెట్ రేట్ల ప్రకారం జరగాలిసిన వ్యాపారమేదో జరుగుతూనే ఉంటుంది. హీరొ రెమ్యునరేషన్ లో పెంపు వల్ల ఓవరాల్ గా అంతగా లెక్కల్లో తేడా రాదు. 

అదలా ఉంచి ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఫార్ములాకొద్దాం. ఇదొక వెరైటీ. చూపులన్నీ ఆకాశం మీద కాదు అంతరిక్షం మీద ఉంటాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా చేసేసాక అన్నీ మామూలు సినిమాల్లాగే కనపడుతుంటాయి తనకి. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తైన నాటి నుంచి మరొక సినిమా చెయ్యలేదంటే ఎంతెలా ఆగి ఆగి వేచి చూస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అందుకే బుచ్చిబాబు సినిమాని పక్కనపెట్టేసాడు, కొరటాల సినిమాని కూడా నీరసంగా మొదలుపెడుతున్నాడు. దృష్టి మాత్రం ప్రశాంత్ నీల్ సినిమా మీద ఉంది. అలాగని ఇదేదో జాగ్రత్త అనుకుంటే పొరపాటే. కొట్టేదేదో పెద్ద కుంభస్థలం కొట్టాలని, ప్రభాస్ స్థాయి రెమ్యునరేషన్ ని దాటిపోవాలని…అలాంటి ప్రాజెక్ట్ కోసమే పనిచెయ్యాలనే ఆకలి. రవితేజలాంటి వాళ్లు ఐదారు సినిమాలకి తీసుకునేది ఒక్క సినిమాకే తీసేసుకునే రేంజుకి ఎదగాలనే ఆకలి. నిజంగా నటన మీద ఆసక్తి, భక్తి ఉన్నవాడు ఇలా చేయడు. మరీ ఇన్ని ఆశలతో కూడిన లెక్కలు, లెక్కలతో కూడిన భయాలు పెట్టుకోడు. ఈ కోవలో చాలామంది హీరోలు తమతమ స్థాయిల్లో కొడితే పెద్ద సినిమా అనే టైపులో ఊహించుకుంటూ కాలయాపన చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. 

యథారాజాతధా ప్రజా అన్నట్టుగా…హీరోల ఆసక్తి మేరకే వ్యవహారాలు నడుస్తుంటాయి. గతంలో ఒవర్సీస్ హక్కులకి విపరీతమైన గిరాకీ ఉండేది. అమెరికాలో పెద్ద దిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు. ఇప్పుడు వాళ్లంతా ఉన్నారా లేరా అన్నట్టున్నారు. మన హీరోలు కూడా తమ జీతమొచ్చాసాక అమెరికాలో ఆడితే ఎంత, ఆఫ్రికాలో ఆడితే ఏవిటి అన్నట్టుగా బతికేస్తున్నారు తప్ప, తాము పని చేసిన సినిమాపైన ప్రేమైతే వారికి లేదు. 

బడా సినిమాల నిర్మాతలకి ఎక్కడో దుబాయిలో ఒక ఒవర్సీస్ బయర్ దొరుకడం, ఏ పాతికకోట్లకో బేరం కుదిరితే అతని చేతిలో సినిమా పెట్టేసి దులిపేసుకోవడం… అంతే. ఇంతకీ ఆ సినిమాని సరిగ్గా పొజిషన్ చేస్తున్నాడా లేదా అనే వ్యవహారాలేవీ హీరోలకే కాదు నిర్మాతలకీ పట్టట్లేదు. డబ్బుచ్చిందా ఇక దాని గురించి మర్చిపోయి తర్వాత ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోవడమే అన్నట్టుగా ఉంది తంతు. 

ఇక్కడ హీరోలకి, నిర్మాతలకి ఎవ్వరికీ సినిమా అంటే ప్రేమ లేదు. డబ్బంటేనే ఆసక్తి. 

ఎక్కడో ఒక రాజమౌళి, ఒక శేఖర్ కమ్ముల లాంటి వాళ్లు తప్ప సినిమా విదుదలయ్యాక కూడా శ్రద్ధగా పబ్లిసిటీ చేసేవాళ్లు తక్కువ. ఇక్కడే సినిమా మీద ఉండే ఆసక్తి బయటపడేది. తాజాగా షారుఖ్ ఖాన్ “పఠాన్” సక్సెస్ తర్వాత ఇప్పటికీ ప్రతి రోజు మీడియాలో ఉంటున్నాడు. ట్విట్టర్లో దేనికో సమాధానం చెప్పడం, ఆ సమాధానం వ్యాసాలుగా మీడియాలోకి రావడం..ఇదీ పరిస్థితి. 

అదే మనవాళ్లైతే సినిమా విదుదలవ్వగానే గాయబ్. తదుపరి సినిమా పెద్దదనిపిస్తే ప్రస్తుతం చేస్తున్న సినిమాపైన కూడా అర్ధమనస్కంగానే ఉంటుంటారు. తదుపరి సినిమా రాజమౌళిది పెట్టుకుని తన సినిమా మీద మహేష్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో త్రివిక్రం కే తెలియాలి. 

వందలకోట్లు గడించడం, వందలకోట్ల విలువ చేసే ఇళ్లు కొనుక్కోవడం తప్ప పెద్ద హీరోలకి కళ పట్ల, సినిమా పట్ల ఎటువంటి ఆరాధనాభావం లేదు.

ఇన్నేళ్ల వయసులో కూడా చిరంజీవి సైతం డబ్బులెక్క వర్కౌటయ్యే “వాల్తేర్ వీరయ్య” లాంటివే చేయడానికి ఇష్టం చూపుతున్నారు తప్ప అప్పట్లోలాగ “రుద్రవీణ” లాంటి సినిమాల గురించి ఆలోచించట్లేదు. చేస్తే చూడరేమోననే భయం..కెరీర్ ఏమౌతుందోననే బెరుకు. ఆ భయం 1980ల్లో యువకుడిగా ఉన్న చిరంజీవికి ఉండడం తప్పుకాదు. కానీ ఇప్పుడు కూడానా! మనిషి గుండెల్ని కదిపే “దృశ్యం” లాంటి సినిమాలు, మట్టి వాసన తెలిపే “కాంతారా” వంటి సినిమాలు ఆయన నుంచి కనీసం నాలుగింటిలో ఒకటన్నా వస్తే ఈ వ్యాసంలో చెప్పుకున్న దోషం పోతుంది. ఆయనని చూసి స్ఫూర్తి పొంది ఇతరులు కూడా అడపాదడపా విలువలున్న సినిమాలు చేసే అవకాశముంటుంది. లేకపోతే ఎప్పుడో రాజమౌళి స్థాయి అంతర్జాతీయ స్థాయి సినిమాలు మినహాయిస్తే తెలుగుసినిమా ఎప్పటిలాగానే మూసలో కొట్టుకుపోతూ ఉంటుంది. 

శ్రీనివాసమూర్తి