మార్గదర్శి విషయంలో ఉమ్మడి హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కూడా ఇంక్లూడ్ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం.
ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో తాజాగా దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం… రిజర్వ్ బ్యాంక్ నిబంధలనను ఉల్లంఘిస్తూ మార్గదర్శి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిందని రెండు వేల ఆరులో ఆయన ఆరోపించారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధం అయ్యింది.
అందులోని అవకతవకల గురించి తేల్చడానికి ప్రత్యేక అధికారిని నియమించింది. రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అయ్యింది. ఆ క్రిమినల్ కంప్లైంట్ ను కొట్టి వేయాలని కోరుతూ.. పదేళ్ల తర్వాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ..కోర్టు తీర్పును ఇచ్చింది.
అయితే అ కేసులో చట్టాన్ని తప్పుగా అన్వయించి మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేశారని.. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారట ఉండవల్లి. ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరినట్టుగా సమాచారం.