భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి రెండు సార్లకు మించి వరసగా పార్టీ అధ్యక్ష పదవిలో ఉండకూడదు, ఒకే వ్యక్తి రెండు పదవులను చేపట్టకూడదు అంటూ బీజేపీ కొన్ని నియమాలను ఆరంభం నుంచి పెట్టుకుంటూ వచ్చింది.
ఆ మేరకు ఆ పార్టీ సీనియర్లు కూడా చాలా మంది రెండు సార్లు అధ్యక్ష పదవిని చేపట్టి ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నియమం ఇప్పుడ అమిత్ షాకు కూడా వర్తించబోతున్నట్టుగా ఉంది.
ఇప్పటికే అమిత్ షా రెండు పర్యాయాల అధ్యక్ష పదవీ కాలం ముగిసినట్టుగా ఉంది. ఆరు నెలల కిందట ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా మరో నేత అవసరం అయితే పడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు రాబోతున్నారట.
ఆ పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయంలో అమిత్ షాకు క్లారిటీ ఉందని, జేపీ నడ్డాకు ఆ పదవి దక్కబోతోందనే ప్రచారం సాగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనే ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కాబోతున్నారని సమాచారం.
ఇప్పటికే అమిత్ షా హోం మంత్రిగా వెళ్లిపోయాకా.. పార్టీ కొన్ని ఎన్నికల్లో ఎదురుదెబ్బ తింది. అమిత్ షా హోమంత్రిగా వెళ్లడంతోనే పార్టీ దెబ్బ తిన్నదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటే బీజేపీ కి కొత్త అధ్యక్షుడు ఏ మేరకు రాణించగలరో మరి!