వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీకి బాగా టార్గెట్ ఆ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డే అని వేరే చెప్పనక్కర్లేదు. జగన్ పై కేసుల నాటి నుంచి.. తెలుగుదేశం పార్టీ విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. ఆ తర్వాత రాజకీయంలో కూడా తెలుగుదేశం పార్టీకి విజయసాయిరెడ్డి సింహస్వప్నంగా మారారు!
ప్రత్యేకించి ఢిల్లీ వ్యవహారాల్లో జగన్ కు విజయసాయిరెడ్డి ఉపయుక్తంగా మారడం తెలుగుదేశం పార్టీకి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనను విమర్శించడమే కాదు.. ఆయనను ఏదోలా దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ శతథా ప్రయత్నిస్తూ ఉంది.
అందులో భాగంగా విజయసాయిరెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఆశాభంగం తప్పలేదు. విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు పడేది ఉండదని రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా గెజిట్ విడుదల అయినట్టుగా తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నియమితం అయ్యారని.. అది లాభదాయకపదవి కింద వస్తుందని, కాబట్టి ఆయనను ఎంపీగా ఉంచరాదని, అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యులు ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సాయిరెడ్డి ఆ పదవిని చేపట్టనే లేదని, ఏపీ ప్రభుత్వం కూడా ఆ నియామకాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని.. కాబట్టి ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం లేదని రాష్ట్రపతి ఆఫీసు స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి మీద పెద్ద ప్రయత్నమే చేసిన టీడీపీ భంగపడినట్టుగా ఉంది!