అతనికి ఫ్లైట్ మిస్సైంది.. శాడిస్ట్ బయటకొచ్చాడు

ఫ్లైట్ టైమ్ కు అరగంట ముందే ఉంటారు ప్రయాణికులు. చెకింగ్ వ్యవహారాలు, ఇతరత్రా వెయిటింగ్ లు కలిపి ఆమాత్రం ముందొస్తేనే విమానాన్ని అందుకోగలం. కానీ ఇక్కడో ప్యాసింజర్ ఎయిర్ పోర్ట్ కి లేటుగా వచ్చాడు.…

ఫ్లైట్ టైమ్ కు అరగంట ముందే ఉంటారు ప్రయాణికులు. చెకింగ్ వ్యవహారాలు, ఇతరత్రా వెయిటింగ్ లు కలిపి ఆమాత్రం ముందొస్తేనే విమానాన్ని అందుకోగలం. కానీ ఇక్కడో ప్యాసింజర్ ఎయిర్ పోర్ట్ కి లేటుగా వచ్చాడు. చెక్ఇన్ టైమ్ అయిపోయిందంటూ విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. లాంజ్ లోకి పోనీయలేదు. దీంతో అతడికి ఒళ్లు మండింది. వెంటనే ఎయిర్ పోర్ట్ ఆఫీస్ కి ఫోన్ చేసి తాను ఎక్కాల్సిన ఫ్లైట్ లో బాంబు ఉందని చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు షాకయ్యారు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.

హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఫ్లైట్ లో బాంబు ఉందంటూ అజ్ఞాత వ్యక్తినుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఆ ఫ్లైట్ ని టేకాఫ్ కాకుండా నిలిపివేశారు. ప్రయాణికుల్ని హుటాహుటిన ఫ్లైట్ నుంచి దింపేసి చెకింగ్ చేపట్టారు. అంతా చెక్ చేశాక బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

ఆ తర్వాత ఫేక్ కాల్ వ్యవహారంపై దృష్టిపెట్టారు. బాంబు ఉందంటూ కాల్ చేసిన నెంబర్.. ఆ ఫ్లైట్ లో వెళ్లాల్సిన ప్రయాణికుడి మొబైల్ నెంబర్ అని తేలడంతో అలర్ట్ అయ్యారు. తీరా అతను ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నాడని తేలడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఫ్లైట్ మిస్ అయితే ఎవరైనా మరో ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకుంటారు, లేదా ప్రయాణం వాయిదా వేసుకుంటారు. కానీ మనోడు మాత్రం ఎలాగోలా ఫ్లైట్ నే తనకోసం ఆపాలనుకున్నాడు. బాంబు ఉపాయం అమలుచేశాడు. ఫ్లైట్ లో బాంబు ఉందంటే కచ్చితంగా దాన్ని ఆపేసి చెక్ చేస్తారని, టేకాఫ్ కి సమయం ఉంటుంది కాబట్టి, తనను కూడా అనుమతిస్తారని అనుకున్నాడు. 

కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు, తనతోపాటు అందరి ప్రయాణాలను డిస్ట్రబ్ చేసినందుకు ఆ శాడిస్ట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.