స్లీప్ డైవోర్స్.. దంపతులకు ఇది అవసరం

విడివిడిగా అర్థం తీసుకుంటే నిద్ర విడాకులు, కానీ ఈ రెండు పదాలకు ఒకటే అర్థం. అదే విడివిడిగా పడుకోవడం. అవును, నిద్రలేమితో సతమతం అవుతున్న దంపతులకు ఇటీవల డాక్టర్లు సూచిస్తున్న నూతన విధానం ఇది.…

విడివిడిగా అర్థం తీసుకుంటే నిద్ర విడాకులు, కానీ ఈ రెండు పదాలకు ఒకటే అర్థం. అదే విడివిడిగా పడుకోవడం. అవును, నిద్రలేమితో సతమతం అవుతున్న దంపతులకు ఇటీవల డాక్టర్లు సూచిస్తున్న నూతన విధానం ఇది. ఒకటిగా పడుకుంటే నిద్ర పట్టకపోతే, విడివిడిగా పడుకోవాలని సలహా ఇస్తున్నారు. పార్టనర్ కి దూరంగా, లేదా వేరు వేరు గదుల్లో ఒంటరిగా పడుకోవడమే స్లీప్ డైవోర్స్.

విడిగా నిద్ర ఆరోగ్యానికి మేలు..

దంపతులిద్దరూ కలసి పడుకుంటే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, కుటుంబ వ్యవహారాలు, ఇతర వ్యవహారాలన్నీ అప్పుడే చర్చకు వస్తాయని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇప్పటి వరకు సైకాలజిస్ట్ లు చెప్పగా మనం విన్నాం. కానీ ఇది అన్నివేళలా మంచిది కాదు. స్లీప్ డైవోర్స్ కూడా అవసరమేనంటున్నారు మరికొంతమంది.

ముఖ్యంగా నిద్రలేమితో సతమతం అయ్యే దంపతులు స్లీప్ డైవోర్స్ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. కొంతమందికి రాత్రివేళ నిద్రపోవాలంటే వెంటనే సాధ్యపడదు, బెడ్ పై అటు ఇటు మసిలి, గంటలసేపు వేచి చూస్తే కాని కునుకు తీయదు. అయితే ఇలాంటి వారు తమ పార్ట్ నర్ లకు దూరంగా ఉంటే మాత్రం ఠక్కున నిద్రపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దానికి స్లీప్ డైవోర్స్ అనే పేరు కూడా పెట్టేశారు.

దీని ప్రకారం దంపతులు విడివిడిగా వేర్వేరు గదుల్లో పడుకోవాలనమాట. ఊసులు చెప్పుకోడానికి, మాట్లాడుకోడానికి ఒకటే బెడ్ రూమ్ సరిపోతుంది, కానీ నిద్రవచ్చే సమయం దాటిపోతే మాత్రం కచ్చితంగా పక్క రూమ్ లోకి వెళ్లి దుప్పటి ముసుగేయడం మేలంటున్నారు. అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడిపేవారి కూడా ఇది ఆరోగ్యకరమైన అలవాటు అని సూచిస్తున్నారు.

ఒకవేళ రెండో పడకగది అనేది సాధ్యంకాకపోతే ఒకే గదిలో రెండు వేర్వేరు బెడ్స్ పై విడివిడిగా పడుకోవడం మంచిదని అంటున్నారు. ఓ పరిశోధన ప్రకారం, అమెరికన్ జంటలలో మూడింట ఒకవంతు ఒంటరిగా నిద్రపోవడానికి ఇష్టపడతారట. ఇతర కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి అలవాట్లే ఉన్నా.. దానికి స్లీప్ డైవోర్స్ అనే పేరుందని మాత్రం ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్.