మందు బాబులు అంటే మహారాజులే. వారు మందు కొడితే స్వర్గం దిగి రావాల్సిందే. వారిదో లోకం. అక్కడ వారే హీరోలు. అలాంటి మందుబాబులు తాగి బైకులు నడిపినా వాహనాలు నడిపినా సాధారణంగా జరీమానాలు విధిస్తారు. కానీ విశాఖలో డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన మందు బాబులకు అధికారులు కొత్త శిక్ష విధించారు.
వారికి బీచ్ లో చెత్తను తొలగించే పనిని అప్పగించారు. బీచ్ క్లీనింగ్ పేరిట అధికారులు దగ్గరుండి వారి చేత చెత్తను ఎత్తించారు. నెత్తిన సూరీడుని పెట్టుకుని చమటకు కక్కుతూ మందుబాబులు నడుం ఒంగేలా చేసిన ఈ పనితో కిక్కు మొత్తం దిగిపోయిందట.
ఇదేమి శిక్షరా బాబూ అని వారు జడుసుకుంటున్నారు. సాధారణంగా డబ్బున్న బాబులు వారి దర్జా వారసులే డ్రంకెన్ డ్రైవ్ లో ఎక్కువగా దొరుకుతూంటారు. ఇంట్లో పనిచేయడమే అలవాటు లేని బాపతుని తెచ్చి బీచ్ లో చెత్తను తీయించడం అంటే పెద్ద శిక్ష అని అంటున్నారు.
ఈ విధంగా యాభై రెండు మంది చేత బీచ్ క్లీనింగ్ పేరిట స్పెషల్ డ్రైవ్ పెట్టి మరీ అధికారులు మందు బాబుల మత్తు అంతా వదలగొట్టేశారు. ఈ శిక్ష వీరికే కాదుట. ఇక మీదట తాగి వాహనాన్ని ఎవరి నడిపినా వారిని తీసుకొచ్చి చెత్తను తీయిస్తామని అలా వారి మత్తుని చిత్తు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ వెరైటీ శిక్షను చూసిన జనాలు ఇది మంచిదే అని తీర్పు ఇస్తున్నారు. మందు తాగి రోడ్ల మీదకు వచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడే వారికి బుద్ధి రావాలంటే సామాజిక సేవ ఏంటో తెలియచెప్పాలని, సమాజం పట్ల బాధ్యత పెంచాలని సూచిస్తున్నారు. చేతిలో డబ్బుంటే ఫైన్ కట్టేసి ఇంటికి జారుకునే బాపతు గాళ్ళను నలుగురిలో పెట్టి సిగ్గు వచ్చేలా పనిచేయించడం కంటే పెద్ద శిక్ష వేరేది ఉండదని అంటున్నారు. మత్తెక్కి బైకులు తిప్పే గ్యాంగులు ఎక్కువైపోతున్న మహా నగరంలో ఈ తరహా శిక్షలు ఎంతో కొంత మార్పును తెస్తాయనే మేధావులు విద్యావేత్తలు అంటున్నారు.